ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పుకోబోతున్నారు... తనయుడు కేటీఆర్‌కు పగ్గాలు అప్పగించబోతున్నారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయంగా ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ బలముంది. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలనేది పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. నిత్యం దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నా అధినేత అంతరంగం ఎక్కడా బయటపడటం లేదు. యువనేతా గుంభనంగానే ఉంటున్నారు. మరోవైపు మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు మాత్రం అదే పనిగా కేటీఆర్ జపం చేస్తున్నారు. అసలేం జరుగబోతోందనేది సహజంగానే ప్రజల్లో ఆసక్తి. అధికార మార్పిడి ఉంటుందా? అయితే ఎప్పుడు? ఇదే అంశంపై అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ‘సాక్షి’అందిస్తున్న కథనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించడం ఖాయంగా కని పిస్తోంది. అయితే అనువైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే మాసానికి కొంచెం అటు ఇటుగా సీఎంగా కేటీఆర్ పదవీ బా«ధ్యతలు చేపట్టే అవకాశముండగా, ఫిబ్రవరిలోనే ఇది జరగొచ్చని పార్టీ లోని ఓ వర్గం బలంగా విశ్వసిస్తోంది. ఈ అంశంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సన్నిహితులు, పార్టీ కీలక నేతలతో అంతర్గతంగా ఎలాంటి చర్చలు జరపలేదని సమాచారం. పార్టీలో చోటు చేసుకుంటున్న పరి ణామాలే కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగించడం దిశగా సాగుతున్నాయి. అయితే అధికార బదలా యింపునకు సరైన పరిస్థితులు, సమ యం కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. యాదాద్రి ఆలయ ప్రారం భం, రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు.. తదితరాలు ముగిసిన తర్వాత ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది.
ఊతమిస్తున్న మంత్రుల ప్రకటనలు
కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగించడంపై పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ఈ అంశంపై ఎక్కడా బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే వారికి సన్నిహితంగా ఉండే నేతలు, పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో పాటు కేసీఆర్ కేబినెట్‌లో కీలక మంత్రి ఈటెల రాజేందర్, ఇతర మంత్రులు కేటీఆర్ సీఎం పదవి చేపట్టడం ఖాయమంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏకంగా ఓ అడుగు ముందుకేసి యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం సీఎం హోదాలో కేసీఆర్‌కు చివరి కార్యక్రమమని ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి మార్పిడి ఖాయమనే ప్రచారం అటు టీఆర్‌ఎస్‌తో పాటు బయటా జోరుగా చర్చ జరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అంతర్గత పరిణామాలపై ఆషామాషీగా ప్రకటనలు చేయరు కదా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
అన్నీ ‘సెట్’కావాలి...
ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కాగా, మరుసటి రోజు ఫిబ్రవరి 18న కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ అంశంపై అంతర్గతంగా ఎలాంటి సంకేతాలు లేకున్నా... మార్చిలో వార్షిక బడ్జెట్ సమావేశాలు జరగడానికి ముందే... ఫిబ్రవరిలో కేటీఆర్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీలోని ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తోంది. ప్రభుత్వం, పార్టీపరంగా కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేసిన తర్వాతే కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఆయన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో కేటీఆర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉండేలా వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.
సంస్కరణలను కొలిక్కి తేవడంపై దృష్టి
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంపై దృష్టి సారించారు. ఓ వైపు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే జిల్లాల పునర్విభజన, స్థానిక సంస్థల్లో పాలన సంస్కరణలు, వ్యవసాయ, రెవెన్యూ తదితర కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సంస్కరణల అమలు సవాలుగా మారినా ప్రస్తుతం వాటిని ఆచరణలోకి తేవడం దాదాపు పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, వేతన సవరణ వంటి అంశాలపైనా ప్రభుత్వ నిర్ణయాలు కీలక దశలో ఉన్నాయి. వీటన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో కొలిక్కి తీసుకురావాలనే కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇవి పూర్తికాగానే కేటీఆర్‌కు సీఎం కుర్చీని అప్పగిస్తారనేది అధినాయకత్వానికి సన్నిహితుల్లోని కొందరి వాదన.
ఎన్నికల సందడి ముగిశాకే అప్పగింత...
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటిన టీఆర్‌ఎస్ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నిక తర్వాత కొంత మేర రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నది. దీనికి తోడు రాబోయే రెండు మూడు నెలల్లో టీఆర్‌ఎస్ మరికొన్ని కీలక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతోంది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలకు మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ‘వరంగల్– నల్లగొండ– ఖమ్మం’, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు కూడా ముహూర్తం ముంచుకొస్తోంది. దీనికి తోడు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా టీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం మినహా ఎన్నికలు జరగాల్సిన మిగతా అన్నింటిలో టీఆర్‌ఎస్ ప్రాతినిథ్యమే ఉంది. దీంతో సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకోవడం అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
తిరుపతి లోక్‌సభ స్థానంతో కాకుండా తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్‌ఎస్ పార్టీ తాజాగా అంచనా వేస్తోంది. మున్సిపల్ కార్పోరేషన్లు, మండలి పట్టభద్రుల కోటా ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించనున్నారు. పైగా సీఎం కేసీఆర్‌కు ముహుర్తాలపై గురి ఎక్కువ. ఇప్పట్లో మంచి రోజులు లేవనేది తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఏడాది ప్రథమార్దానికి అటూ ఇటూగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి. ఈలోగా కేటీఆర్ జిల్లా పర్యటనలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, ఎన్నికల సన్నాహక సమావేశాల్లో క్రియాశీలంగా పాల్గొనేలా కార్యాచరణ సిద్దమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల సమీక్షలను కూడా ఆయన నిర్వహించారు.
కేబినెట్‌లో విధేయతకు పెద్దపీట
ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని తేలడంతో మంత్రివర్గ కూర్పుపైనా ఇప్పటి నుంచే జోరుగా ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన వారికి పదవుల పంపిణీలో పెద్ద పీట వేయడంతో పాటు మంత్రివర్గ కూర్పులో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారితో అక్కడక్కడా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అలాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపాలనే యోచనలో టీఆర్‌ఎస్ అధినేత ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వారు ఇప్పటికే ఉన్నత పదవుల్లో ఉంటే వారి ప్రాధాన్యతను తగ్గిస్తూ, కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో పార్టీ విధేయులకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment