
ఆదివారం యాదాద్రి ఆలయ వీధుల్లో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు ఏకాదశి కలసి రావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు.
దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కాగా, వివిధ పూజల ద్వారా యాదాద్రి దేవస్థానానికి రూ.59,04,585 నిత్య ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.