రవికుమార్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మహిళను కట్నం వద్దంటూ వివాహం చేసుకున్న రెస్టారెంట్ నిర్వాహకుడు ఆపై అతని అసలు రంగు చూపించాడు. కట్నానికి బదులుగా ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలో షేర్లు రాయాలంటూ బెదిరించాడు. శారీకంగా, మానసికంగా వేధించడంతో పాటు ఆమెపై సీసీఎస్‌లో తప్పుడు కేసు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని సీసీఎస్ ఆధీనంలోని మహిళ ఠాణాలో ఫిర్యాదు చేసింది. రవికుమార్‌తో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం...
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన రీనా ఓ ప్రైవేట్ సంస్థకు ప్రమోటర్ డైరెక్టర్. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి నుంచి వచ్చి గడ్డిఅన్నారంలోని తిరుమల హిల్స్‌లో నివసిస్తున్న రెస్టారెంట్ నిర్వాహకుడు తగరం రవికుమార్‌తో ఈమెకు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైంది. రీనా తల్లిదండ్రులు, రవికుమార్ సమీప బంధువులైన తగరం అబ్రహం, మేరీ రాణి, కరుణ కుమారి, శ్రీనివాస్‌లతో సంప్రదింపులు జరిపారు.
వాళ్లు కట్నం కోసం పట్టుబట్టడంతో సంబంధం కుదరలేదు. ఆపై కొన్నాళ్లకు రీనాతో సంప్రదింపులు జరిపిన రవి కట్నం లేకుండా వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఈ సమయంలోనే రవికుమార్ యోగా ట్రైనర్‌గా చెప్పుకొన్న షాగుఫ్తాను రీనాకు పరిచయం చేశాడు. గతేడాది అక్టోబర్ 15న నిశ్చితార్థం, ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం జరిగాయి.
చదవండి: Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
కొన్నాళ్లకే అసలు రంగు..
రవికుమార్ నిశ్చితార్థం, వివాహానికి ఆయన తరఫువారు హాజరు కాలేదు. దీంతో వారి కోసమంటూ రవి కుమార్ చింతలపూడిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మరోసారి వివాహ కార్యక్రమం, పార్టీ పెట్టాడు. అయితే వివాహమైన కొన్ని రోజులకే రవికుమార్, అతడి కుటుంబీకుల అసలు రంగు బయటపడింది. కంపెనీలో రీనా షేర్లు, ఆస్తులు అడగటంతో భర్తే కదా అని ఆమె అన్నీ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంటికి ఆలస్యంగా రావడం మొదలెట్టాడు. అదేమని ప్రశ్నిస్తే అసభ్యంగా, అభ్యంతరకరంగా దూషించడంతో పాటు చేయి చేసుకునే వాడు.
ఉద్దేశపూర్వకంగా కులాల ప్రస్తావన తీసుకువస్తూ కించపరిచే వాడు. తాను కట్నం తీసుకోలేదు కాబట్టి తన కంపెనీతో పాటు కుటుంబీకులకు ప్రైవేట్ సంస్థలో రీనాకు ఉన్నవి బదిలీ చేయాలని బలవంతం చేశాడు. ఈ ఏడాది మార్చి 11న ఇంటి నుంచి వెళ్తూ బదిలీ పూర్తయితేనే వస్తానన్నాడు. మర్నాడు రాత్రి వచ్చిన రవి షేర్లు బదిలీ చేయాలంటూ రీనాను దూషించడంతో పాటు తీవ్రంగా హింసించాడు. ఆమె సంస్థలోనే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టాడు. తాను చెప్పినట్లు చేయకపోతే పరువు తీస్తానని, హైదరాబాద్‌లో తలెత్తుకుని బతకలేని స్థితి తీసుకువస్తానని బెదిరించాడు. అలా బయటకు వెళ్లిన రవి కొన్నాళ్ల వరకు తిరిగి ఇంటికి రాలేదు.
సీసీఎస్‌లో కేసు పెట్టి..
దీంతో రీనా స్వయంగా అతడి ఇంటితో పాటు చైతన్యపురిలోని అతడి రెస్టారెంట్‌కు వెళ్లింది. రీనాను రవి కుమార్ ఇరుగు వారికి, రెస్టారెంట్ ఉద్యోగులకు సైతం అప్పటి వరకు పరిచయం చేయలేదు. ఇంటికి రావడం పూర్తిగా మానేసిన రవి యోగా ట్రైనర్‌గా చెబుతున్న షాగుఫ్తాతో కలిసి ఉంటున్నట్లు రీనా తెలుసుకున్నారు. రవి ఈ ఏడాది మార్చిలో రీనాతో పాటు ఆమె కుటుంబీకులు, మరికొందరిపై సీసీఎస్‌లో తప్పుడు ఫిర్యాదు చేశాడు.
మహిళా ఠాణాలో ఆరుగురిపై కేసు..
అప్పటి వరకు తనతో పాటు కుటుంబం పరువు కోసమంటూ బాధలు భరించిన రీనా ఈ కేసుకు సంబంధించిన నోటీసులు అందడంతో నోరు విప్పారు. సీసీఎస్ పోలీసుల ఎదుట అసలు విషయం చెప్పడంతో పాటు ఆధారాలు అందించారు. దీంతో రవి ఫిర్యాదు వాస్తవ దూరమని తేల్చిన అధికారులు ఆ కేసు మూసేశారు. ఇతగాడి వ్యవహారాలు శ్రుతి మించడంతో రీనా సైతం ఉమెన్ పోలీసుస్టేషన్ మెట్లు తొక్కారు. రవికుమార్‌తో పాటు అతడి కుటుంబీకులు తగరం అబ్రహం, తగరం మేరీ రాణి, కరుణ కుమారీ, షాగుఫ్తాలపై ఫిర్యాదు చేశారు.
ఈమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన పోలీసులు వీరిపై ఐపీసీతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రీనాను వివాహం చేసుకున్న రవికుమార్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికోసం జూన్ 10న ఇండియా క్రిస్టియన్ మాట్రిమోనీ సైట్‌లో మరో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీన్ని అతడి తల్లిదండ్రులు తెరిచినట్లు అందులో పొందుపరిచాడు. ఈ విషయాన్నీ పోలీసులు పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment