డ్రోన్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి సింధియా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి తదితరులు
వికారాబాద్: ‘రెండు, మూడు వందల ఏళ్ల క్రితం ప్రపంచంలో ఫాలోవర్‌గా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేస్థాయికి ఎదిగింది. ఇది ప్రధాని మోదీ కలలు గన్న భారత్’అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయం పరెడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలతో కలసి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మారుత్, టెక్ ఈగల్, స్కై ఎయిర్ కంపెనీలకు చెందిన మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారి వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మొదటి, రెండో, మూడో డ్రోన్లను సింధియా, కేటీఆర్, సబితారెడ్డిలు అనౌన్స్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి సిం«ధియా మాట్లాడుతూ ఆకాశయానంలో డ్రోన్ వ్యవస్థ ఓ కొత్త శకానికి నాంది పలకనుందని, ఇది ఎన్నో నూతన సవాళ్లకు పరిష్కారం చూపనుందని అభిప్రాయపడ్డారు. వైద్యులకు సహకారం అందించటంలో భవిష్యత్తులో డ్రోన్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తం కానుందని, వైద్యరంగంలో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’కార్యక్రమం విప్లవాత్మక మార్పులు తేనుందన్నారు. దేశంలో డ్రోన్లు ఎగిరేందుకు ఉన్న ఆంక్షలు సడలిస్తామని, ఇందుకోసం మూడు రకాల జోన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
డ్రోన్లు ఎగిరేందుకు అనుమతులు అవసరంలేని గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్లు ఎగిరేందుకు వీలులేని ప్రదేశాలు, ప్రాంతాలను రెడ్‌జోన్‌గా విభజిస్తామని తెలిపారు. ‘మెడిసిన్ ఫ్రం ది స్కై కార్యక్రమం ప్రధాని మోదీ కల అని తెలిపారు. ఒక్కోసారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు సకాలంలో మందులు చేరవేయలేక రోగుల ప్రాణాలు పోతుంటాయని, దానికి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమం ప్రత్యామ్నాయం కాగలదని పేర్కొన్నారు.
దేశానికి తెలంగాణ ఆదర్శం: కేటీఆర్
‘దేశంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం. నేడు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్ల క్రితమే సాంకేతికతపై దావోస్‌లో జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో డ్రోన్ల వినియోగం గురించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సాంకేతికతలో తెలంగాణ ముందుందనటానికి ఇదే నిదర్శనమన్నారు.
హెల్త్ కేర్‌కు సాంకేతికతను జోడించటం ఎంతో అవసరమని కేటీఆర్ అన్నారు. గతంలో గుండెమార్పిడి లాంటివి జరిగితే పోలీసుల సాయంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించి అంబులెన్స్‌లలో గుండెను, ఇతర శరీర అవయవాలను నిర్దేశిత ప్రాంతాలకు చేరవేయటం మనం చూశామని, ఇప్పుడు ఆ ఇబ్బందులేవీ లేకుండానే డ్రోన్ల సాయంతో తక్కువ సమయంలో గుండె లాంటి అవయవాలను చేరవేయవచ్చని తెలిపారు.
వ్యవసాయ పొలాల్లో పురుగుల మందులు చల్లటం, శాటిలైట్ మ్యాపింగ్ చేయటం, దిశ లాంటి సంఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడికి డ్రోన్లను పంపి అప్రమత్తం చేయటం, అడవుల్లో మొక్కలు పెంచేందుకు సీడ్‌బాల్స్ చల్లటం లాంటి ఎన్నో రకాల పనులకు భవిష్యత్తులో ఈ డ్రోన్లను వాడవచ్చని తెలిపారు. పోలీసు వ్యవస్థలో సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించటానికి కూడా ఈ వ్యవస్థను వినియోగించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. బేగంపేటలోని పాత విమానాశ్రయంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.
రాష్ట్రంలో ఏరో స్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దీనికి కేంద్రం సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జెడ్పీ చైర్‌పర్సన్లు సునితారెడ్డి, అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురబి వాణిదేవి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య, మూడు డ్రోన్ల తయారీ కంపెనీల ప్రతినిధులు విక్రం, ప్రేమ్, స్వప్నిక్ తదితరులు పాల్గొన్నారు.
► మారుత్ కంపెనీ రూపొందిం చిన హెపీ కోప్టర్ ఇది. దీని దూర సామర్థ్యం 40 కిలోమీటర్లు కాగా ఇది అత్యధికంగా 16 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. దీంట్లో ఒక్కోటి మూడు కిలోల బరువుతో ఉన్న నాలుగు బాక్సుల్లో మొత్తం 12 కిలోలు ఉంచారు. ఏ గమ్యస్థానానికి పంపకుండా ఆకాశంలో ఆ బరువుతో ఎగిరేలా చేసి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు.
డ్రోన్లు ఎలా ఎగిరాయంటే....
1. మొదటి డ్రోన్: బ్లూ డార్ట్ కంపెనీ వారు రూపొందించిన స్కై ఎయిర్ డ్రోన్. ఇది కిలో బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఈ డ్రోన్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యసింధియా ప్రారంభించారు. ఇందులో ఒక వ్యాక్సిన్ బాక్సు మాత్రమే ఉంచారు. ఇది 40 కిలో మీటర్ల దూరం వరకు ఆకాశమార్గాన ప్రయాణించగలదు. ఇది వికారాబాద్ పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి చేరుకోగా, ఇందులో ఉన్న వ్యాక్సిన్‌ను సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు. ఈ డ్రోన్‌లో సరఫరా చేసిన వ్యాక్సిన్ ఉష్టోగ్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని వారు నిర్ధారించారు. ఇది ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంది.
2. రెండో డ్రోన్: టెక్ ఈగల్స్ కంపెనీ వారు రూపొందించిన క్యూరీస్ ఫ్లై. దీని సామర్థ్యం కూడా ఒక కిలో కాగా ఇది కూడా 40 కిలో మీటర్ల దూరం వరకు ఎగరగలదు. ఈ డ్రోన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, ఇది ఆరు నిమిషాల వ్యవధిలో మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ పీహెచ్‌సీకి చేరుకుంది. దీన్ని కేవలం ట్రయల్ చేసి చూశారు.
విమానాల తయారీకి అనువుగా హైదరాబాద్ ప్రాంతం
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల టాటా ఏరోస్పెస్ సెజ్‌లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శనివారం పర్యటించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరి«ధిలో గల టాటా ఏరోస్పెస్, బోయింగ్ విమానాల తయారీ కేంద్రాన్ని సాయంత్రం 6:10 గంటలకు సందర్శించారు. రక్షణరంగ సంస్థల కోసం తయారు చేస్తున్న విమానాల విడి భాగాలను మంత్రి పరిశీలించారు. వాటి పనీతీరుపై టాటా సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పక్కనే ఉన్న టాటా లాకిడ్ మార్టిన్‌లో విమాన విడిభాగాలను తయారీ సంస్థను పరిశీలించారు. హైదరాబాద్ ప్రాంతం విమానాల తయారీకి అనువుగా ఉందని సింధియా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు.
అనంతరం 6:40 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మంత్రి రాకతో ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి టాటా ఏరోస్పెస్ వరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యోతిరాధిత్య సిందియా వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ విమానం ఎక్కడమే ప్రధాని కల
శంషాబాద్: దేశంలో ప్రతి ఒక్కరు విమానయానం చేయాలన్నదే భారత ప్రధాని నరేంద్రమోదీ కల అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రత్యేక ఆర్థిక జో¯న్‌లో జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏవియేషన్ స్కూల్ నూతన భవనానికి శనివారంరాత్రి ఆయన శంకుస్థాపన చేశారు. విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment