రెండేళ్ల పదవీ కాలం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మనోగతం  | Minister Jagadish Reddy And Nalgonda MLAs Interview With Sakshi | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీ జిల్లాకు కలికితురాయి: మంత్రి

Published Thu, Dec 17 2020 9:09 AM | Last Updated on Thu, Dec 17 2020 9:12 AM

Minister Jagadish Reddy And Nalgonda MLAs Interview With Sakshi

‘స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేదే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాతిపదికనే పార్టీ ఆవిర్భవించి ప్రజల ఆశీర్వాదంతో మరోమారు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విపక్షాలు ఎన్ని విమర్శలు.. ఆరోపణలు చేసినా ఇది కఠోర వాస్తవం. మాటతప్పి..మడమ తిప్పే నైజం మాది కాదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరో మూడేళ్లలో అన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా దశదిశ మార్చి మళ్లీ దీవించాలని కోరుతాం.’ ఇదీ.. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మనోగతం.

సాక్షి, సూర్యాపేట: ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఎన్నో ఏళ్ల కింద తీసిన కాల్వల్లో ఇక నీళ్లు రావని ఆయకట్టు రైతులు భావించారు. కానీ ఈ కాల్వల్లో గోదావరి జలాలు పారించి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది మా ప్రభుత్వం. మూసీ, గోదావరి, కృష్ణా జలాలతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి.

ఎక్కడ చూసినా పచ్చదనమే..
జిల్లాకు గోదావరి జలాల రాకతో ఆయకట్టులో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంది. గోదావరి జలాలను ఈ కాలువలకు మళ్లించి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. గతేడాది నుంచి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తూ వస్తున్నాం. ఇలా పూర్తి స్థాయిలో పంటకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో ఆయకట్టులో రెండు సీజన్లకు నీళ్లు అందుతున్నాయి.

వైద్యరంగంలో బలోపేతమయ్యాం..
జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు రావడం మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. సూర్యాపేటలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో జిల్లా మరింత ముందంజలో ఉంది. మెడికల్‌ కళాశాల జిల్లాకు కలికితురాయి. కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్పొరేట్‌ స్థాయిని మించి వసతులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోడ్ల వెడల్పు, జంక్షన్ల నిర్మాణ పనుల కార్యక్రమం మొదలైంది. సద్దల చెరువు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటోంది. పట్టణ నడిబొడ్డున మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం అయింది. మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. 

⇒ ఎన్నికల హామీలు నెరవేరుతున్నాయి..
నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇంటింటికీ తాగునీరు అందించడంతోపాటు సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాం. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మరో మూడేళ్లలో నియోజకవర్గాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నల్లగొండ పట్టణానికి రెండో పైప్‌లైన్‌ తీసుకొచ్చి తాగు నీటి సమస్య లేకుండా చేశా. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. నల్లగొండను మోడల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. గత పాలకులు వదిలేసిన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీలు పెంచడంతోపాటు డయాలసిస్‌ వ్యవస్థను మెరుగు పర్చాం. సిటీస్కాన్‌ ఉపయోగంలోకి తెచ్చాం, ఎంఆర్‌ఎస్‌ స్కాన్‌ , కేన్సర్‌ యూనిట్‌కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. రూ.275 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీలోని 32ఎకరాల విస్తీరణంలో మెడికల్‌ కళాశాల నూతన భవనం నిర్మించబోతున్నాం , దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం. 

⇒ రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు: మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం.  ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో రూ.100 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. ఆగిపోయిన మినీ రవీంద్రభారతికి రూ.3కోట్లు కేటాయించాం. సంత్‌సేవాలాల్‌ భవనం, జ్యోతిరావుపూలే భవనం నిర్మిస్తున్నాం. మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయి. రూ.17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ పనులు సాగుతున్నాయి. రూ.50 కోట్లతో పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశాం. కేఎన్‌ఎం కళాశాలను ప్రభుత్వ పరం చేయడంతోపాటు జూనియర్‌ కళాశాలలో రూ.3కోట్లతో తరగతి గదులను నిర్మిస్తున్నాం. పట్టణంలో 560 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.50 కోట్లతో 31 చెక్‌ డ్యామ్‌లను నిర్మించనున్నాం. మిర్యాలగూడ పట్టణంలో 80 పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాం. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నాం.

⇒ తొలి ఏడాదిలోనే సగం వాగ్దానాలు పూర్తి చేశా
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌: ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశా. , మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తా. ఇచ్చిన హామీ మేరకు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చా. కోదాడ పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశాం. కోదాడ ట్యాంక్‌బండ్‌ పనులతో పాటు మరో 8ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేసి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. పేదలకు 1,840 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేస్తాం. ఇంటిస్థలం ఉన్న మరో 3 వేల మందికి రూ.5లక్షలు ఇప్పించడానికి కృషి చేస్తా. 

⇒ హామీలు పురోగతిలో ఉన్నాయి
హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న అడ్లూరు, చింతిర్యాల, గుర్రంబోడు, రేబల్లె లిఫ్ట్‌లను తరలించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేయించాం. అదేవిధంగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. మేళ్లచెరువు, మఠంపల్లి, మండలాల్లో చాలా వరకు లింక్‌ రోడ్లు, బ్రిడ్జి మంజూరు చేయించా. కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హుజూర్‌నగర్‌ రింగ్‌ రోడ్డు మిగిలిన పనులకుగాను రూ.5 కోట్లు మంజూరు చేయించా. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్‌ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నా. ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం మేళ్లచెరువులో 5ఎకరాల భూమి కేటాయించాం. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు సంబంధించిన కేసులు కోదాడ కోర్టుకు వెళ్తున్నాయి. వాటిని హుజూర్‌నగర్‌ కోర్టు పరధిలోకి తెచ్చే అంశం ఫైల్‌ సీఎం కేసీఆర్‌ దగ్గర ఉంది. త్వరలోనే క్లీయర్‌ అవుతుంది. హుజూర్‌నగర్‌లో ప్రత్యేకంగా నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) సెంటర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మఠంపల్లి మండలంలో 2,500 ఎకరాలు భూ సేకరణ జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. 

⇒ సాగునీరు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి: భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతా. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ అండతో రూ.20 కోట్లతో హెచ్‌ఎండీఏ నిధులతో నియోజకవర్గంలో మురుగు కాలువలు, సీసీరోడ్లు చేపట్టాం. 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. అన్ని గ్రామాల రైతులకు సాగు నీరందిస్తాం. బస్వాపురం రిజర్వాయర్‌ పూర్తి కావస్తోంది. రిజర్వాయర్‌లో1.5 టీఎంసీల కాళేశ్వరం నీరు రైతులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మూసీ కాల్వలైన బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన భువనగిరిలో రూ.8.72 కోట్లతో మోడల్‌మార్కెట్‌ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు కోసం రూ.15.18 కోట్లతో పనులు చేపట్టాం. రూ.1.60కోట్లతో స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లతో అభివృద్ధిపనుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. 

⇒ పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టా
నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య :  ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్‌ ప్రాజెక్టు ప నులపై దృష్టి సారించా.  ఉదయసముద్రంతోపాటు, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తిచేయించి సాగునీరు అందించడానికి కృషిచేస్తా. పిలాయిపల్లి ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ధర్మారెడ్డిపల్లి ఆధునికీకరణ పనులు 70శాతం పూర్తయ్యాయి. వచ్చే వేసవి వరకు పెండింగ్‌ పనులను పూర్తి చేయించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఆసిఫ్‌నహర్, శాలిగౌరారం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.25కోట్లు, ఎర్రకాలువ పునర్నిర్మాణానికి రూ.30కోట్లతో  ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నకిరేకల్, రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని 100 పడకలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవసరమైన పోస్టులు మంజూరయ్యాయి. నకిరేకల్‌లోని డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కట్టించేందుకు కృషి చేస్తా. చిట్యాల పట్టణంలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్‌ నిర్మించాల్సి ఉంటుంది. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌లో కోల్డ్‌స్టోరీజే ఏర్పాటు చేయిస్తా.   

⇒ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. 
దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ఎన్నికల సమయంలో దేవకకొండ నియోజకవర్గంలోని ప్రజలకు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చుతా. పొగిల్ల, నంబాపురం అంబాభవాని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని హామీలు ఇచ్చా. ఈ మేరకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కుల, సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఇప్పటికే ఖిలాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుకబడ్డ చందంపేట మండల గిరిజనుల కోసం పొగిల్ల, అంబాభవాని, నంబాపురం ఎత్తిపోత పథకాలు సైతం కార్యరూపం దాల్చేందుకు పేపర్‌ పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఇప్పటికే 526 డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మండలాల్లో స్థల సేకరణ జాప్యంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. కోర్టు కేసుల నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రి కార్యరూపం దాల్చే క్రమం కొంత ఆలస్యమైంది. కోర్టు కేసులు పూర్తయినందున త్వరలోనే వంద పడకల ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యాలు, సిబ్బంది వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement