బోడుప్పల్: తెలంగాణ క్రీడాకారులు పట్టుదల, కసితో క్రీడలు ఆడి జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించాలని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బోడుప్పల్‌లోని వైష్ణవి క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం రాత్రి దివంగత చెర్ల ఆంజనేయులు యాదవ్ జ్ఞాపకార్థం టీఆర్‌ఎ అధ్యక్షుడు మంద సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 68వ కబడ్డీ సీనియర్ ఇంటర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగా హకీం పేట్‌లో స్పోర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
క్రీడాకారులు అసమానతలు తొలగించి అందరం ఒకే కుటుంబం అనే భావన కల్పించాలన్నారు. క్రీడల్లో పైరవీలకు తావు లేదని, గెలవాలనే తపన, లక్ష్యం ఉన్న క్రీడాకారులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, క్రీడల్లో రాణించే వారికి 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శామీర్‌పేట్‌లో 250 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
క్రీడాకారులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కబడ్డీ ప్రాచీణమైనదని, క్రికెట్‌ను తలదన్నేలా కబడ్డీ క్రీడాకారులు రాణించాలన్నారు. తొలుత కబడ్డీ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల భరత నాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్ యాదవ్, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కిందపడ్డ మల్లారెడ్డి
కబడ్డీ పోటీల ప్రారంభంలో భాగంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లారెడ్డి కబడ్డీ ఆడారు. ఇరువురు రెండు జట్టులుగా ఏర్పడి కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన మల్లారెడ్డి గ్రౌండ్‌లో వేసిన మ్యాట్ జారడంతో కింద పడిపోయారు. దీనిని గమనించిన మంత్రి శ్రీనివాస్ మల్లారెడ్డిని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment