సాక్షి, హైదరాబాద్: సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటేనని అన్నారు మంత్రి సీతక్క. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సమానత్వ సాధన దిశలో విద్య కీలకం అంటూ సీతక్క చెప్పుకొచ్చారు.
గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..‘గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు మీరంతా సమావేశమైనందుకు అభినందనలు. కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు జీవోలను ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన నిర్మాన్ సంస్థ ఫౌండర్ మయూర్‌కి ప్రత్యేక అభినందనలు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారు.
సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే. అందుకే విద్య అనేది చాలా ముఖ్యం. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే. సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మైదాన ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలి. సమానత్వ సాధన దిశలో విద్య కీలకం
హైదరాబాద్‌లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో, మారుమూల పల్లెలో అలాంటి విద్య ఉండాలి. ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారు. అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు మీ వంతు సహకారం అందించండి. సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతులున్న సమాజంలో కనీస విద్య లేనివారు సమాజంలో ఉండటం బాధాకరం.
అందుకే అంతరాలను తగ్గించేందుకు మీ వంతు చేయూత ఇవ్వండి. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే మా లక్ష్యం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే వివక్షతా భావం ప్రజల్లో పెరుగుతోంది. మీరంతా గ్రామాలకు తరలండి.. అటవీ గ్రామీణ పరిస్థితులను చూడండి. విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించండి. ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్లుగా మిమ్మల్ని ఆరాధిస్తారు. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి. అప్పుడు మీరే మార్పునకు నాంది పలికిన వారు అవుతారు. మనసుంటే మార్గం ఉంటుంది. ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక.. అందరూ అక్కడ పర్యటించండి. ఏసీ గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలి. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయండి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment