సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి తొలి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుండటంతో ఈ స్థానాలకు ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తుది ఓటర్ల జాబితాలు సిద్ధమవ్వడం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశాలున్నాయి. చదవండి: (టీఆర్‌ఎస్‌లో కొలువుల జాతర)
నిర్ణయాత్మక శక్తిగా పురుష ఓటర్లు..
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల మండలి స్థానం తుది ఓటర్ల జాబితాను ఈ నెల 18న ప్రకటించగా, మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల స్థానం ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించారు. ‘వరంగల్’పట్టభద్రుల స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ‘మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానం పరిధిలో 5,17,883 మంది తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు. ఈ రెండు స్థానాల్లో కూడా మహిళా ఓటర్లతో పోల్చితే దాదాపు రెట్టింపు సంఖ్యలో పురుష ఓటర్లు ఉండటంతో.. ఎన్నికల ఫలితాల్లో పురుష ఓటర్లు నిర్ణయాత్మకంగా మారబోతున్నారు. ‘వరంగల్’స్థానం పరిధిలో 3,23,377 పురుష ఓటర్లుండగా, కేవలం 1,67,947 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు. మహబూబ్‌నగర్ స్థానం పరిధిలో 3,27,727 మంది పురుష ఓటర్లుండగా, 1,90,088 మంది మహిళా ఓటర్లున్నారు.
దరఖాస్తుకు ఇంకా చాన్స్..
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల స్థానం, వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానాల తుది ఓటర్ల జాబితాలను ప్రకటించినా ఇంకా ఓటర్ల నమోదుకు అవకాశముంది. తమ పేరు నమోదు చేసుకోలేకపోయిన వారు, తుది ఓటర్ల జాబితాలో పేరు సంపాదించలేకపోయిన వారు దరఖాస్తు చేసుకొని త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటేయడానికి అర్హత పొందవచ్చు. నామినేషన్ల స్వీకరణ చివరిరోజుకు 10 రోజుల ముందు వరకు వచ్చే ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన వారికి ఓటు హక్కును కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ అధికార వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment