
సాక్షి, హైదరాబాద్ /సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కోవిడ్ పరీక్షలను మరింత సులభతరం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు సరికొత్త కిట్ అభివృద్ధి చేశారు. నోరు లేదా ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల ఆధారంగానే కోవిడ్‌ను గుర్తించగలగడం ఈ కిట్ ప్రత్యేకత. కోవిహోం అని పిలుస్తున్న ఈ కిట్‌ను త్వరలోనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని తయారీ ఖర్చు రూ.400 వరకు ఉందని, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ఖర్చు రూ.300కు తగ్గుతుందని కిట్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శివ్ గోవింద్‌సింగ్ తెలిపారు.
పని చేస్తుందిలా..!
స్మార్ట్‌ఫోన్‌లో ఐ కోవిడ్ పేరుతో అభివృద్ధి చేసిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఈ కిట్ ను ఉపయోగించాలని శివ్ గోవింద్ చెప్పారు. ముందుగా చిప్‌ను కిట్‌లోని చొప్పించాలని, అంతకుముందే ఓటీజీ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను, ఈ కిట్‌ను అనుసంధానించు కోవాలని వివరించారు. ఆ తర్వాత వినియోగదారుడి వివరాలను నమోదు చేసి చిప్‌ను తొలగించి ముక్కు లేదా నోటి నుంచి సేకరించిన ద్రవ నమూనాను చేర్చాల్సి ఉంటుంది. 20 నిమిషాల తర్వాత చిప్ ను మరోసారి కిట్‌లోకి చొప్పించి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లో పరీక్షించి ట్యాబ్‌ను నొక్కితే 10 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి.
నైపుణ్యం అవసరం లేదు
ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు ప్రత్యేకమైన పరికరాలు, బీఎస్‌ఎల్ లెవెల్–2 పరిశోధనశాల అవ సరం ఉండగా.. కోవిహోంకు అలాంటి అవసరం ఉండదు.