సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలుత మందకొడిగా సాగింది. 50 ఏళ్ల పైబడిన వారు, వృద్ధులు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు బూత్‌లకు రావడం పెరిగింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక 3 గంటల వరకు 59.92 శాతం మంది ఓట్లు వేశారు. 50 మంది సర్వీసు ఓటర్లు మినహాయిస్తే మిగతా 2,41,805 మందికి గాను 1,44,878 మంది మధ్యాహ్నం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం సహా చాలా గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది.
ఈవీఎంల మొరాయింపు
చండూరు మండలం కొండాపురం గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఈవీఎంలలో సాంకేతి లోపం ఏర్పడి దాదాపు గంట పాటు మొరాయించాయి. వాటిని మార్చేసి పోలింగ్ కొనసాగించారు. నాంపల్లి మండల కేంద్రంలో, సంస్థాన్‌నారాయణపురం మండలం కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. అల్లందేవి చెరువు గ్రామంలో ఈవీఎంలో ఎర్రర్ చూపించడంతో 20 నిమిషాల వరకు పోలింగ్ ఆగిపోయింది.
కేటీఆర్ హామీతో పోలింగ్‌కు హాజరు!
గట్టుప్పల్ మండలం రంగతండా, హజినతండా గ్రామస్తులు మధ్యాహ్నం వరకు ఓటు వేయలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలుగా చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో వసతులు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొనమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. 3 గంటల ప్రాంతంలో తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓ టీఆర్‌ఎస్ నాయకుడు..కొందరు గ్రామస్తులను మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. సమస్యలను పరిష్కరిస్తానని, తానే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు.
పలుచోట్ల ఉద్రిక్తతలు
పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు వెళ్లిపోయేంతవరకు పోలింగ్‌ను ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొడవ ముదిరింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో వరంగల్‌కు చెందిన వారు స్థానికంగా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. మధ్యాహ్నం తర్వాత చండూరులో డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
రూ.14.5 లక్షలు స్వాధీనం
నాంపల్లి మండలం మల్పరాజు గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీకి ప్రయత్నిస్తుండడంతో పోలీసులు, ఇతర సిబ్బంది వారి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చండూరు పరిధిలో రూ.1.60 లక్షలు, గట్టుప్పల్ మండలంలో రూ. 2.90 లక్షలు పట్టుకున్నారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి సూచనలు చేశారు.
చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment