
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఆస్తులు, అప్పులతో పాటు పోలీస్ కేసుల వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోమవారం ఆయన చండూరులో నామినేషన్ వేశారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారంగా ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి పేరుపైన ఉన్న ఆస్తుల విలువ రూ.152 కోట్ల 69లక్షల 94వేలు కాగా, ఆయన భార్య లక్ష్మి పేరున రూ.48,55,25,250 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి.
నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వ్యవసాయ భూములు, రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.69,97,70,142, ఆయన భార్య పేరుపైన రూ.3,89,63,167 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.274 కోట్లు. బ్యాంకులో అప్పు రూ.61,84,80,220 ఉన్నట్లు చూపారు.
కాగా, 2014లో మునుగోడు నుంచే పోటీ చేసినప్పుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్తిరాస్తుల విలువ రూ.47కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.265 కోట్లు ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.198 కోట్లుగా ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు.
స్రవంతి ఆస్తుల విలువ రూ.40 కోట్లు
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్బంగా రిటర్నింగ్ అధికారికి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం స్రవంతి పేరుపైన రూ.25,71,52,390 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఆమె భర్త పేరుపై రూ.15,13,25,804 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చూపించారు. బ్యాంకులో స్రవంతి పేరున రూ.6 లక్షలు, భర్త పేరున రూ.55 లక్షల అప్పులు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment