సాక్షి, హైదరాబాద్: భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2009 నుంచీ తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో భువనగిరి ఎంపీగా గెలిచినా.. 2019లో తన ఓటమికి పార్టీలో అంతర్గత కుట్రలు కూడా కారణమని ఆరోపించారు. తనను ఎంతగానో అవమానించినా ఇన్నాళ్లూ భరించానని, రాజకీయంగా వెట్టిచాకిరీ చేయలేకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తాను పైరవీలు చేసే వ్యక్తిని కాదని.. ప్రజల సమస్యలను వివరించే అవకాశం కూడా తనకు కల్పించలేదని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యలను ప్రస్తావించిన తనపై అసహనం వ్యక్తం చేయడం ఓ ఉద్యమకారుడిగా ఎంతో బాధించిందన్నారు. లేఖలోని అంశాలు బూర నర్సయ్యగౌడ్ మాటల్లోనే..
బీసీలు వివక్షకు గురికావడం బాధాకరం
‘‘మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయిన నన్ను ఒక్కసారి కూడా సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలకు సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగాను. మునుగోడు టికెట్ బీసీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని అడగటం కూడా నేరమేనా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానంతో, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగాను. కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు వ్యక్తిగతంగా అవకాశాలు రాకున్నా ఫర్వాలేదు. కానీ అట్టడుగు వర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చే అవకాశమే లేనప్పుడు పార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టిచాకిరీని ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు.
ఒక్క నిమిషం కలిసే అవకాశం ఇవ్వలేదు
తెలంగాణ ఉద్యమంలో రోజులు, నెలలు, ఏళ్లు గడిపిన సహచర ఉద్యమకారులు ఇప్పుడు కనీసం ఒక నిమిషం కేసీఆర్‌ను కలవాలన్నా.. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రభుత్వం తరఫున పెట్టకపోవడం అందరినీ బాధిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడ రొయ్యలు అమ్ముకోవచ్చు. కర్రీ పాయింట్స్ పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో, సచివాలయంలో మాత్రం తెలంగాణ ప్రజలే ఉంటారని అప్పట్లో ప్రజల చప్పట్ల మధ్య చెప్పాం. కానీ ఇప్పుడు తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్ కలిపినా.. ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల టీడీఎస్ అంత కూడా ఉండడం లేదు.’’అని నర్సయ్యగౌడ్ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బీజేపీలోకి టీఆర్‌ఎస్ కీలక నేత
Comments
Please login to add a commentAdd a comment