
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖులపై ఈడీ విచారణ మంచి పబ్లిసిటీతో రక్తి కట్టిస్తుందని, అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశసరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడం, డ్రగ్ మాఫియాను అణిచివేయడం, ఎన్నికల్లో నల్లధనాన్ని ఆపడమే ధ్యేయంగా ప్రధాని మోదీ నోట్లరద్దుని ప్రకటించారని మరి ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరిందా అని ప్రశ్నించారు.
గతంలో డ్రగ్స్ వినియోగించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని, విచారించిన రిపోర్టు బుట్టదాఖలైందని మండిపడ్డారు. ఇప్పటి విచారణ కూడా కళాకారులను ఏడిపించేదిగా ఉంది తప్ప అసలు మాఫియాను పట్టుకునేదిగా కనపడటం లేదని విమర్శించారు.