సాక్షి, నల్లగొండ: పార్టీ ఆఫీసు నిర్మాణం విషయంలో బీఆర్ఎస్‌కు ఒక న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు గులాబీ పార్టీ నేతలు. నల్లగొండలో బీఆర్‌ఎస్ ఆఫీసును కూల్చివేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు స్పందించారు. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజాగా నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మేము ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లలేదు. తెలంగాణలో ఏ పార్టీ ఆఫీసుకు అనుమతులు లేవు. నిబంధనల ప్రకారమే లీజుకు తీసుకుని అనుమతి కోసం దరఖాస్తు చేశాం. 5800 గజాల్లో పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టుకున్నాం. 2019లో ఆఫీసు నిర్మాణం చేపట్టి 2020లో పూర్తి చేశాం. నిర్మాణంపై మేము దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వలేదు. ఆనాటి కమిషనర్ ఆఫీసు నిర్మించుకోమని చెప్తేనే మేము ముందుకు వెళ్లాం.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావాలనే ఆఫీసును కూల్చేస్తా అని మాట్లాడారు. కోమటిరెడ్డికి చట్టమేమీ చుట్టం కాదు. మాకు న్యాయం జరుగుతుందనుకుంటే అన్యాయం జరిగింది. కోర్టు తీర్పుపై మరో కోర్టును ఆశ్రయిస్తాం. కోమటిరెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవు. ఆఫీసు భవనాన్ని ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగిస్తామంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యాలయం కూలిస్తే ఏం వస్తుంది. ఒకసారి కూలిస్తే అనుమతులు తీసుకుని నాలుగింతల నిర్మాణం చేస్తాం. మీలా మాకు కూల్చడం తెలియదు. నిలబెట్టడం మాత్రమే తెలుసు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయమా?.
మిగతా పార్టీల కార్యాలయాలకి కూడా అనుమతులు లేవు. వాటిని కూల్చే దమ్ము మంత్రి కోమటిరెడ్డికి ఉందా?. పార్టీ ఆఫీసును కూల్చడానికి అధికారులు కాకుండా కోమటిరెడ్డి అనుచరులు వస్తున్నారు. వారే జేసీబీలు తీసుకువస్తున్నారు. కేసీఆర్ హయాంలో నల్లగొండలో రూ.374 కోట్ల పనులు జరిగాయి. మరి వాటి సంగతేంటి? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయడం పాపమే అవుతుంది.
👉మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసు విషయంలో కోర్టు తీర్పుపై పైన కోర్టుకు వెళ్తాం. కోర్టు ఆర్డర్ కాపీ రాకముందే కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై స్పందించాలి. దీనిపై మేము పైన కోర్టకు వెళ్లే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు.
👉మరో బీఆర్‌ఎస్ నేత చెరుకు సధాకర్ మాట్లాడుతూ..‘బీజేపీ బుల్డోజర్ సంస్కృతిని కాంగ్రెస్ అమలు చేస్తోంది. బుల్డోజర్ సంస్కృతిని కోర్టు సమర్థించడం బాధాకరం. విదేశాలకు వెళ్లి వచ్చే లోపు కూలగొట్టాలని మంత్రి అనడం ఏంటి?. ఒక కోర్టు ఇచ్చిన తీర్పును మరో కోర్టు తప్పుబట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు విజ్ఞత ఉంటే ఇలాంటి పనులు చేయదు. కూలగొడుతాం అంటే చేతులు ముడుచుకొని కూర్చోం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment