సాక్షి, నల్లగొండ : సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఇకనుంచి నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానుంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేయడం.. వాటిని డ్రా చేసే సందర్భంలో కొన్ని పంచాయతీల్లో ఇబ్బందులు తలెత్తుతుండడంతో సర్పంచ్‌లంతా నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేయాలని చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత జనవరి మాసం నుంచి వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఒకేసారి మార్చి వరకు మూడు మాసాల వేతనాన్ని విడుదల చేసి వాటిని నేరుగా సర్పంచ్‌ల వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 7 గ్రామపంచాయతీలు నకిరేకల్ మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ సర్పంచ్‌లు లేరు. ఐదుగురు సర్పంచ్‌లు సస్పెన్షన్‌కు గురికాగా అక్కడ ఉప సర్పంచ్‌లకు బాధ్యతలను అప్పగించారు. ఇద్దరు సర్పంచ్‌లు జెడ్పీటీసీలుగా ఎన్నిక కావడంతో అక్కడ కూడా ఉప సర్పంచ్‌లు బాధ్యతుల నిర్వహిస్తున్నారు. ఈ ఏడుగురికి కూడా గౌరవ వేతనం పొందే అవకాశం కల్పించారు.
కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు
నూతన పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వ చెక్ పవర్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు డ్రా చేయాలంటే ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. ఈ సందర్భంలో కొన్ని చోట్ల సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడడంతో సర్పంచ్‌లు గౌరవ వేతనం తీసుకునే సందర్భంలో ఉప సర్పంచ్‌లు సంతకం పెట్టని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమకు గౌరవంగా ఇచ్చే వేతనాన్ని పొందేందుకు కూడా ఉప సర్పంచ్‌ల సంతకం వల్ల చిన్నచూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో సర్పంచ్‌లు పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు.
ఈ నెల నుంచి నేరుగానే వేతనాలు
ఇప్పటినుంచి నేరుగానే సర్పంచ్‌ల గౌరవవేతనాన్ని వారి సొంత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత జనవరి మాసం వేతన బకాయితోపాటు నడుస్తున్న ఫిబ్రవరి, మార్చితో కలిపి 3 నెలల గౌరవవేతనాన్ని ఒకేసారి 1,25,55,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి డీపీఓ అకౌంట్లలో జమ చేసింది. రెండు మూడు రోజుల్లో ఆయా సర్పంచ్‌ల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ కానున్నాయి.
మూడు మాసాల వేతనం ఒకేసారి..
సర్పంచ్‌లకు జనవరి నుంచి వచ్చే మార్చి మాసం వరకు మూడు మాసాల గౌరవ వేతనాన్ని 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. గతంలో పంచాయతీ ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ప్రస్తుతం నేరుగా సర్పంచ్‌ల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశాలు అందాయి. రెండు మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
– డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment