New Trends In Theft At Hyderabad - Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ మార్చిన జేబు దొంగలు.. పర్సులతో ‘గిట్టుబాటు’ కాకపోవడంతో వాటిపై కన్ను.. కోడ్‌ భాషతో చోరీలు

Published Thu, Feb 9 2023 1:52 AM | Last Updated on Thu, Feb 9 2023 3:29 PM

New Trends in Thefts in Hyderabad - Sakshi

జేబు దొంగలు (పిక్‌ పాకెటర్స్‌) ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. ఒకప్పుడు పర్సులు కొట్టే పిక్‌ పాకెటర్లు ఇప్పుడు సెల్‌ఫోన్లు, ఇతర సొత్తును టార్గెట్‌గా చేసుకుని పక్కా ప్లానింగ్‌తో పని కానిచ్చేస్తున్నారు. ఆ..చిల్లర దొంగల్లే అనుకోకండి. అతి చిన్న నేరమైన పిక్‌ పాకెటింగ్‌పై ఆధారపడి హైదరాబాద్‌లో ఇప్పుడు అనేక వ్యవస్థీకృత ముఠాలు పని చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పోలీసు రికార్డుల్లోకి ఎక్కవు.

కానీ రాజధానిలో ఏటా జరుగుతున్న సాధారణ చోరీలు, దోపిడీలు, దొంగతనాల్లో చోరుల పాలవుతున్న సొత్తుకు సమానంగా జేబు దొంగలు గుల్ల చేస్తున్న మొత్తం ఉంటోందని అంచనా. అందుకే ఓ పక్క ఒంటరి నేరగాళ్లు పిక్‌ పాకెటింగ్‌లు చేస్తుండగా, మరోపక్క వ్యవస్థీకృత ముఠా నేరగాళ్లు ఈ చోరీలు చేయిస్తున్నారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు గతంలో చిక్కిన థండర్‌ సింగ్‌ కుష్వా అనే పిక్‌ పాకెటర్‌ చందానగర్‌లో నివసిస్తున్న ఫ్లాట్‌ అద్దె నెలకు రూ.30 వేలుగా తేలడం..విస్మయం కలిగించే అంశం. కాగా మహా నగరంలో వ్యవస్థీకృతంగా జరుగుతున్న పిక్‌ పాకెటింగ్స్‌లో ఏటా బాధితులు నష్టపోతున్నది రూ.30 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. 

ఖాళీ పర్సులతో గిట్టుబాటు కాక..! 
హైదరాబాద్‌లో పిక్‌ పాకెటింగ్‌ గ్యాంగ్‌లు ఏళ్లుగా పని చేస్తున్నాయి. మధ్య, పశ్చిమ, తూర్పు మండలాల్లోని అనేక ప్రాంతాలు వీరికి అడ్డాలుగా ఉన్నాయి. ఈ ముఠాలు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్‌ చేసేవి. ప్రతి నెలా మొదటి, రెండు వారాల్లో జీతం డబ్బుతో ఇళ్లకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకునేవి. అయితే ప్లాస్టిక్‌ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్‌ కార్డుల వినియోగం పెరిగిన తర్వాత పర్సుల్లో నగదు అంతగా లేకపోతుండటంతో వీరికి ‘గిట్టుబాటు’కావట్లేదు.

పర్సుల్లో దొరికిన కార్డుల్ని తీసుకువెళ్లి షాపింగ్‌ చేయడం, ఏటీఎం సెంటర్లలో నగదు డ్రా చేయడం ఓ పట్టాన కుదిరే పనికాదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డారు. చోరీ చేసిన ఫోన్ల ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిషకేషన్‌ (ఐఎంఈఐ) నంబర్‌ను క్లోనింగ్‌ చేసి అమ్మడం ద్వారానో, రాష్ట్ర సరిహద్దుల్ని దాటించి విక్రయిస్తూనో, కొన్నాళ్ల పాటు వినియోగించకుండా ఉంచేసి తర్వాత సొమ్ము చేసుకోవడమో చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం దొంగలకు అనుబంధంగా మరికొన్ని గ్యాంగ్స్‌ పని చేస్తుంటాయి. ఈ కారణంగానే చోరీకి గురైన ఫోన్లు సాంకేతికంగానూ ట్రాక్‌ కావట్లేదు. 

ప్రత్యేక పారిభాషక పదాలు.. పక్కా ప్లానింగ్‌ 
పిక్‌ పాకెటింగ్‌ ముఠాలకు ప్రత్యేక పారిభాషిక పదాలు కూడా ఉన్నాయి. రద్దీగా ఉండే బస్సులు, ఆటోలు, మార్కెట్లను ఎంచుకునే ఈ గ్యాంగ్‌ సభ్యులు టార్గెట్‌ను అనుసరిస్తుంటారు. మొదట గ్యాంగ్‌లోని కొందరు సభ్యులు ఎంచుకున్న వ్యక్తి చుట్టూ చేరతారు. ఇలా చేరడాన్ని ఫీల్డింగ్‌ అని, వారిని ‘ఆడి’అని పిలుస్తారు. వీరు సదరు వ్యక్తి చుట్టూ చేరి హడావుడి చేయడంతో పాటు గందరగోళ వాతావరణం, ఒత్తిడి కలిగిస్తారు.

అదే అదనుగా మరో ముఠా సభ్యుడు తమ ‘టార్గెట్‌’నుంచి సెల్‌ఫోన్, పర్సు లేదా సొత్తును చోరీ చేస్తాడు. ఇలా చేయడాన్ని స్ట్రైకింగ్‌ అని, అతడిని ‘షాను’అని పిలుస్తుంటారు. కావాల్సింది చేతి కందగానే ‘షాను’అక్కడ నుంచి ఉడాయించడమో, మరో వ్యక్తికి అందించి పంపేయడమో చేస్తాడు.

బస్సుల్లో ఈ చోరీలు జరుగుతుంటే దాని వెనుకే వీరి ఆటో ఫాలో అవుతుంది. ఈ ముఠా సభ్యులు ‘శిక్షణ’కూడా పొందుతారు. ‘పని’కి ఉపక్రమించే ముందు అంతా ఓ చోట సమావేశమై చోరీ చేయాల్సిన విధానాన్ని చర్చిస్తారు. ఆ సమయంలో జరిగే పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహ రచన చేస్తుంటారు. అంతా కలిసి ఒకేచోట కాకుండా జట్లుగా విడిపోయి ‘పని’చేస్తుంటారు. ఈ ముఠాలో ఎవరైనా పోలీసులకు చిక్కితే గ్యాంగ్‌ లీడర్‌ న్యాయవాదిని ఏర్పాటు చేయడం, బెయిల్‌కు అవసరమైన ఖర్చులు భరించడం వంటివి చేస్తుంటాడు.  

ఎక్కడా ఆధారాలు లేకుండా... 
ఈ నేరంలో ఎంత మొత్తం పోయినా దానికి బాధితుడి వాంగ్మూలం తప్ప ఎలాంటి ఆధారం ఉండదు. పిక్‌ పాకెటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సీసీ కెమెరాలు వంటివి ఉన్న ప్రాంతాల్లో చేతివాటం చూపరు. షాపింగ్‌ మాల్స్‌ సహా మరికొన్ని చోట్లకు వెళ్లరు. చోరీకి పాల్పడిన వెంటనే సొమ్మును క్షణాల్లో జట్టులోని ప్రధాన వ్యక్తికి అందిస్తారు. అతడు వెంటనే అక్కడ నుంచి జారుకుంటాడు. ఒకవేళ బాధితుడు తన జేబును ఖాళీ చేసిన వ్యక్తిని పట్టుకున్నా ఫలితం ఉండదు. ఆధారాలేమీ చిక్కవు. సొమ్ము అందుకునే వ్యక్తి ముఠాకు సూత్రధారిగా వ్యవహరిస్తాడు. ఏదైనా ముఠా చిక్కినప్పుడు వారి వాంగ్మూలం ఆధారంగా కొలిక్కిరావాల్సిందే తప్ప ప్రత్యేక దర్యాప్తు అంటూ ఉండదు. అప్పటివరకు కేసు పెండింగ్‌ జాబితాలో ఉండిపోవాల్సిందే. అందుకే పోలీసులు సైతం ఈ ఫిర్యాదుల్ని పెద్దగా పట్టించుకోరు. కేసుగా నమోదు చేయడానికి అంగీకరించరు.  

హద్దు ‘దాటితే’అంతే.. 
ఒంటరిగా నేరాలు చేసే వారు ఎక్కడ పడితే అక్కడ చేసినా.. వ్యవస్థీకృత గ్యాంగులు నడిపించే వారు మాత్రం కొన్ని ప్రాంతాలు, బస్సులు, రూట్లు ఎంపిక చేసుకుంటారు. నిత్యం ఆయా ప్రాంతాల్లోనే తమ పంజాలు విసురుతుంటారు. గతంలో టాస్‌్క ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన మన్సూర్, జహీర్, మొయిన్‌లు కేవలం చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌ మధ్యే బస్సుల్లో చోరీలు చేశారు. ఒక ముఠా నేరాలు చేసే ప్రాంతంలోకి మరో ముఠా వస్తే సహించరు. ఎంతకైనా తెగిస్తారు.

మొఘల్‌నగర్‌కు చెందిన జహీర్‌.. అక్రమ్‌ నేతృత్వంలో నడిచే గ్యాంగ్‌లో పని చేసి ఆపై సొంత ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో పంజా విసిరేవారు. అవే ఏరియాల్లో ఖైసర్‌ గ్యాంగ్‌ సైతం చోరీలు చేస్తుండటంతో వీరి మధ్య వైరం ఏర్పడింది. దీంతో ఖైసర్‌ను హత్య చేయడానికి జహీర్‌ కుట్రపన్ని పోలీసులకు చిక్కాడు. జేబు దొంగల ముఠాల మధ్య తరచు ఇలాంటి గ్యాంగ్‌ వార్‌లు, హత్యలు సైతం నగరంలో వెలుగు చూస్తున్నాయి.  

ఈ ప్రాంతాల్లో  జాగ్రత్తగా ఉండాల్సిందే.. 
పిక్‌ పాకెటింగ్‌ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చాలావరకు మల్లేపల్లి, మాన్గార్‌బస్తీ, పాతబస్తీలోని వట్టేపల్లి, హసన్‌నగర్, ఫలక్‌నుమా, డబీర్‌పుర, తలాబ్‌కట్ట, షాహీన్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. వీరు పంజా విసిరే వాటిల్లో ఐఎస్‌ సదన్, ఇమ్లిబన్, అఫ్జల్‌గంజ్, ఉస్మానియా ఆసుపత్రి, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, నిజాం కాలేజ్, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, చిక్కడపల్లి, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్‌లతో పాటు టూరిస్టుల్ని కొల్లగొట్టేందుకు అనువుగా ఉండే చారి్మనార్, లాడ్‌బజార్, గుల్జార్‌హౌస్‌ తదితర ప్రాంతాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరితో కొందరు అవినీతి పోలీసులు కుమ్మక్కవుతుండటం గమనార్హం. పిక్‌ పాకెటింగ్‌ గ్యాంగ్స్‌ను నిర్వహిస్తూ కానిస్టేబుల్‌ ఒకరు నల్లగొండ పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం. మరికొందరు పోలీసుల పైనా ఈ ‘మిలాఖత్‌’ఆరోపణలు ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement