2017 వేతన సవరణ అమలు ప్రారంభం
21 శాతం ఫిట్‌మెంట్‌తో బ్యాంకు ఖాతాల్లో జమ
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాల చెల్లింపు మొదలైంది. 2017 నాటి వేతన సవరణకు సంబంధించి గత మార్చిలో ప్రభుత్వం ఫిట్‌మెంట్ ప్రకటించటంతో, ఆ మేరకు కొత్త వేతనాలను జూన్ 1న చెల్లించారు. మే నెలకు సంబంధించి వేతనాలు తాజాగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయి. 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకారం కొత్త వేతనాలు అందుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి.
ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపుతో..
2017లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవటంతో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు అప్పట్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. వాటితో చర్చించేందుకు నాటి ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. వేతన సవరణ చేయకుంటే సమ్మెను ఆపబోమని కారి్మక సంఘాలు తేల్చి చెప్పటంతో, మధ్యే మార్గంగా 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్‌కు కమిటీ ప్రతిపాదించింది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీనికి కార్మిక సంఘాలు సమ్మతించి సమ్మెను విరమించాయి. అప్పటినుంచి ఐఆరే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మార్చిలో 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఇక అప్పటివరకు ఉన్న 82.6 శాతం కరువు భత్యంలోంచి, 2017 వేతన సవరణ గడువు నాటికి ఉన్న 31.1 శాతాన్ని ఉద్యోగుల మూలవేతనంలో చేర్చారు.
మిగిలిన కరువు భత్యాన్ని 43.2 శాతానికి న్యూట్రలైజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఆర్టీసీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను తగ్గించారు. మొత్తంగా కాస్త సంతృప్తికరంగానే ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపు అమలులోకి రావటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు మాత్రం ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనటంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రూ. 360 కోట్ల భారం
ఈ వేతన సవరణతో ఆరీ్టసీపై సాలీనా రూ.360 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంతో, రోజువారీ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు సంస్థ ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తోంది. ఇది కొంతవరకు సత్ఫలితాలనిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment