సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ మహమ్మారి దాదాపుగా అన్ని వర్గాలపై, నేపథ్యాలున్న వారిపై ఇంకా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తూనే ఉంది. దీని నియంత్రణకు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇంకా సఫలం కాలేదు. మొదటి దశ కంటే రెండో దశలో ఉగ్రరూపంతో సామాన్య జనజీవనం అతలాకుతలమై పోయింది. ఇతరులతో పోల్చితే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు బాగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల వీరు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కరోనా తర్వాత కూడా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది’.. అని నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ శ్రీభూషణ్‌రాజు తెలిపారు. కరోనా నేపథ్యంలో కిడ్నీ వ్యాదిగ్రస్తులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారిపై కోవిడ్ ఏరకంగా ప్రభావం చూపిస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటన్న అంశాలను శ్రీభూషణ్‌రాజు ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
కొత్తగా కిడ్నీ సమస్యలు
రెండు దశల్లోనూ ఇబ్బంది పడినా.. మొదటి దశతో పోల్చితే సెకండ్ వేవ్‌లో కరోనాతో కిడ్నీ రోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. గత లాక్‌డౌన్‌లో డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి చేసుకున్న వారు రవాణా, మందుల విషయంలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఆ సమస్యలు పరిష్కారమయ్యాయి. చాలామందికి వైరస్ సోకినా, మరణాలు తక్కువగానే నమోదయ్యాయి. అవి కూడా జబ్బు తీవ్రత కంటే ఎక్కడ కిడ్నీ చికిత్స చేయించుకోవాలో తెలియక పోవడం వల్ల చోటు చేసుకున్నాయి. ఇక రెండోదశలో గతంలో కంటే ఎక్కువగా కిడ్నీ రోగులు కరోనా బారినపడ్డారు. కిడ్నీ రోగుల్ని.. మూత్రపిండాలు దెబ్బతిన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్నవారు, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నవారు ఇలా మూడురకాలుగా వర్గీకరించవచ్చు.
అయితే ఈసారి కరోనా ఇన్ఫెక్షన్ల వల్లనో లేక వాడిన మందుల కారణంగానో కొత్తగా కిడ్నీ సమస్యలు తలెత్తిన వారి సంఖ్య కూడా పెరిగింది. కోవిడ్ వల్ల నార్మల్‌గా ఉన్నవారిలోనూ కిడ్నీ టిష్యూలలో, ఇతర అవయవాల్లోనూ వైరల్ పార్టికల్స్‌ను డాక్టర్లు గమనించారు. దీనిని బట్టి వైరస్‌కు అవయవాల్లోకి చొచ్చుకువెళ్లి పాడు చేసే గుణం ఉందని తేలింది. సెకండ్‌వేవ్‌లో మరణాలు కూడా పెరిగాయి. మిగతా వారితో పోల్చితే కిడ్నీ జబ్బు ఉన్న వారిలో మరణాల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంది. మొదటిదశలో కిడ్నీ పేషెంట్లు, ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నవారు జాగ్రత్తలు తీసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండగలిగారు.
సొంత వైద్యాలతో ఇబ్బందులు
శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ ఇలా.. ఏదైనా అవయవం బలహీనంగా ఉంటే వాళ్లపై కరోనా లేదా ఏ వైరస్ అయినా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల వీరంతా మిగతావారి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. విచ్చలవిడిగా తీసుకుంటున్న మందులతో, సొంత వైద్యాలు, చిట్కాలతో చాలా మంది ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు రావడానికి ఇదే ప్రధాన కారణం. అందువల్ల తమకెదురయ్యే సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వ్యవహరించాలి. ఇలా అవగాహనతో వ్యవహరించిన చాలామందిని బాగు చేయగలిగాం.
ఈ జాగ్రత్తలు పాటించాలి
- మామూలు జలుబు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినా డాక్టర్లను సంప్రదించాలి
- మరో 2 నెలలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. కుటుంబసభ్యులకు దూరం ఉండాలి.
- కలిసి భోజనం, టీవీ చూడడం వంటివి కూడా చేయకూడదు.
- అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి
- కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లు 3,4 నెలలకు సరిపడా మందులు సిద్ధంగా ఉంచుకోవాలి
- మిగతావారి మాదిరిగానే థర్మామీటర్ లేదా పల్స్ ఆక్సిమీటర్‌తో తరచుగా టెస్ట్ చేసుకోవాలి
- ఇంటి వద్దే రక్తపరీక్ష చేయించుకుని క్రియాటిన్ చెక్ చేసుకుంటే కిడ్నీల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది
- ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎప్పుడూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం మంచిది.
- డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ రోగులు ఇన్ఫెక్షన్ రాకపోయినా హోం ఐసోలేషన్ పాటించాలి
- బయటికి వచ్చినప్పుడు డబుల్ మాస్క్, ఫేస్‌షీల్డ్ తప్పక ధరించాలి
- బీపీ, ఇతర మందులను ఆపకుండా వాడాలి
- చక్కటి ఆహారం, మంచినిద్ర ఉండాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.
► కరోనా ఉగ్రరూపం
నేపథ్యంలో దాని బారిన పడిన ఆరోగ్యవంతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధుల (కోమార్బిడీస్)తో బాధపడుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.
► ఇతర రోగులతో పోల్చితే అతి సున్నితమైన ఆరోగ్య పరిస్థితి కలిగి ఉండే కిడ్నీ (మూత్రపిండాలు) వ్యాధిగ్రస్తులు కరోనా రెండు దశల్లోనూ ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండోవేవ్‌లో మరణాలు పెరిగాయి.
► అందువల్ల కిడ్నీ రోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇంట్లోనూ భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
► అలాగే ప్రస్తుత గడ్డుకాలంలో వీరికి సకాలంలో వైద్యసేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తే మంచిదని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్‌రాజు సూచిస్తున్నారు.
చదవండి: Coroanvirus: దొరకని మందులు రాయకండి
Comments
Please login to add a commentAdd a comment