
భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ‘హిట్ అండ్ రన్’ నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇంధన ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు కూడా ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెపై తెలంగాణ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ స్పందించారు.
తెలంగాణలో ఆయిల్ ల్యాంకర్ల సమ్మెలేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుతో డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేశారని తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. డ్రైవర్లు వాహనాలు నిలిపివేయడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు విధి విధానాలు ఏంటనేది స్పష్టతగా తెలియాల్సి ఉందని చ ఎప్పారు. అందువల్ల వాహనదారులను డ్రైవర్ అసోసియేషన్ ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. చట్ట సవరణ బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుందామన్నారు.
కాగా ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను తీసుకొచ్చింది. త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు పెట్టింది.
నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అదే విధంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది
దీనిపై ట్రక్కు డ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు రోజులపాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు, పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీఛార్జీలకు దారితీశాయి. పెద్దసంఖ్యలో ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment