తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణం | Patnam Mahender Reddy Sworn In As Telangana Minister - Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణం

Published Thu, Aug 24 2023 3:34 PM | Last Updated on Thu, Aug 24 2023 4:10 PM

Patnam Mahender Reddy Sworn In As Telangana Minister - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. మహేందర్‌రెడ్డితో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు.

అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన మహేందర్‌రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్‌ఎస్‌ టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. 

కాగా, పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది.

మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్‌ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్‌ జెడ్పీటీసీగా ఉన్నారు.
చదవండి: గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు: హైకోర్టు

కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిలను బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్‌ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ మరో సారి టికెట్‌ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్‌ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం.. మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement