ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బాన్సువాడ: నకిలీ నోట్ల కేసులో బాన్సువాడ యువకుడ్ని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో కలకలం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌లో నకిలీ నోట్లను ముద్రించగా, సుమారు రూ.8 లక్షల విలువైన నోట్లను బాన్సువాడ యువకుడు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇవే నకిలీ నోట్లు మధ్యప్రదేశ్‌లోనూ చెలామణి కాగా, అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఫేక్ కరెన్సీ విషయం వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్ జిల్లా కేంద్రంలో నరేశ్‌పవార్ అనే వ్యక్తి నకిలీ నోట్లు ముద్రించగా, అతని నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నోట్లను కొనుగోలు చేసినట్లు తేలింది. విచారణలో అతను ఇచ్చిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లా జీరాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మంగళ్‌సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. బాన్సువాడకు చెందిన యువకుడు నకిలీ విషయం యూట్యూబ్‌లో చూసి నరేశ్‌పవార్‌ను సంప్రదించినట్లు తేలింది.
దీంతో మధ్యప్రదేశ్ పోలీసు లు శుక్రవారం రాత్రి బాన్సువాడకు వచ్చారు. స్థానిక పోలీసుల సహాయంతో సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు సుమారు రూ.8 లక్షల నకిలీ నోట్లను బాన్సువాడకు తీసుకొచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, నోట్ల చెలామణి చేశాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులకు ఎలాంటి నకిలీ నోట్లు లభించలేదు. నకిలీ నోట్లు ప్రింట్ చేసిన వ్యక్తిని ఏ–1గా చేర్చి, అతని వద్ద నోట్లు కొనుగోలు చేసిన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై దృష్టి సారించారు. వీరంతా కలిసి భారీగా నకిలీ నోట్లను ముద్రించేందుకు ప్లాన్ వేసిన ట్లు తెలిసింది. నకిలీ నోట్ల కేసులో బాన్సువాడకు చెందిన యువకుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బాన్సువాడ టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి చెప్పారు. అతను ఎన్ని నోట్లు తీసుకువచ్చాడు? చెలామణి చేశాడా.. లేదా? అనే సమాచారం లేదని తెలిపారు.
వర్నీలో రూ.2 వేల నకిలీ నోటు
వర్నీలో రూ.2 వేల నకిలీ నోటు వెలుగు చూసింది. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామా నికి చెందిన ఓ మహిళ.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో కూలీ పనికి వెళ్లగా, రైతు ఆమెకు రూ.2 వేల నోటు ఇచ్చాడు. అయితే, అది దొంగ నోటుగా గుర్తించిన మహిళ కుమారుడు రెండ్రోజుల క్రితం బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో అందజేసినట్లు సమాచారం. ఆ నోటును శుక్రవారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఎస్సై మంగళ్‌సింగ్ రాథోడ్ పరిశీలించగా, అది చత్తీస్‌గఢ్ ముఠాది కాదని తేల్చినట్లు సమాచారం. ఈ నోటు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ప్రింట్ చేశారని, ఈ నకిలీ నోట్లను కర్ణాటక నుంచి చెలామణి చేశారని గుర్తించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment