బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.10లోని ఇల్లీయూజన్ పబ్‌లో శనివారం వీకెండ్ నైట్‌లైఫ్‌లో భాగంగా ప్రముఖ బాలివుడ్ నటీ సన్నీ లియోన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఆమె ఈ పబ్‌లో ఒప్పందం ప్రకారం డీజే ప్లే చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పించాలి. ఇందుకోసం నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతి కోరగా, ఇందుకు నిరాకరించారు.
ఉదయం నుంచే సన్నీ లియోన్ రాకకోసం కుర్రకారు ఎదురు చూస్తుండగా, అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఫైల్ పక్కన పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నీ లియోన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఎలాగైనా ఆమెను పబ్‌కు తీసుకు రావాలని ప్రయత్నించారు. మరోవైపు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌లోకి రానివ్వొద్దంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పబ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టికెట్లు కొనుగోలు చేసిన యువతీ యువకులు రాత్రి 8 గంటల నుంచే పబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు.
ఒక వైపు పోలీసుల మోహరింపు..మరో వైపు అనుమతుల నిరాకరణ...ఇంకో వైపు హోటల్లో సన్నిలియోన్ ఎదురు చూపుల మధ్య హైడ్రామా రక్తి కట్టింది. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు సన్నీలియోన్ ఆరోగ్యం బాగాలేనందున ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్షలు పోసి టికెట్లు కొన్న యువతీ యువకులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అడ్డదారిలోనైనా ఆమెను తీసుకొస్తారేమోనని అనుమానించి పబ్ చుట్టూ 100 మంది పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ఇక ఆమె రాదని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment