హోటల్‌ బిజినెస్‌ డల్‌ | Poor food In Hyderabad | Sakshi
Sakshi News home page

హోటల్‌ బిజినెస్‌ డల్‌

Published Tue, Jun 11 2024 6:51 AM | Last Updated on Tue, Jun 11 2024 6:51 AM

Poor food In Hyderabad

    ఆన్‌లైన్‌ బిజినెస్‌పై కూడా ఎఫెక్ట్‌  

    సగం హోటళ్లలో నాణ్యత లేని ఆహారం 

    ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: హోటల్‌ ఫుడ్‌పై వినియోగదారుల్లో నమ్మకం పోయింది. హైదరాబాద్‌ సహా తెలంగాణలో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నాసిరకం ఆహారం అందిస్తున్నాయని తేలడంతో బయటి ఆహారం తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఫుడ్‌సేఫ్టీ అధికారుల అంచనా ప్రకారం ఈ దాడుల అనంతరం ఏకంగా 30 శాతం హోటల్‌ బిజినెస్‌ తగ్గింది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా ఫుడ్‌ డెలివరీ కూడా భారీగా తగ్గిందని తెలుస్తోంది.  

ఆన్‌లైన్‌ డెలివరీల ద్వారా మరింత నాసిరకం ఫుడ్‌ సరఫరా 
ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా వరకు పరిశుభ్రతలోపం, ఆహార పదార్థాల్లో నాణ్యత లేమి స్పష్టంగా కనిపించినట్టు సమాచారం. పాడైపోయి, కాలంచెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో పేరుమోసిన హోటళ్లు, బేకరీలు, ఐస్‌క్రీం సెంటర్లున్నాయి. ప్రముఖ హోటళ్లలో పాడైపోయిన ఆహారపదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్‌ సేఫ్టీ రూల్స్‌ కూడా సరిగ్గా పాటించడం లేదు.

 ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌ ఆధ్వర్యంలోని టాస్‌్కఫోర్స్‌ బృందాలు విడుదల చేసిన జాబితా ప్రకారం క్రీమ్‌స్టోన్, న్యాచురల్స్‌ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీహౌస్, షాగౌస్, కామత్‌ హోటల్, 36 డౌన్‌టౌన్‌ బ్రూపబ్, మాకౌ కిచెన్‌ అండ్‌ బార్, ఎయిర్‌లైవ్, టాకోబెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్‌ జో, ఖాన్‌సాబ్, హోటల్‌ సుఖ్‌సాగర్, జంబో కింగ్‌ బర్గర్స్, రత్నదీప్‌ స్టోర్, రెస్ట్‌ ఓ బార్‌ వంటి అనేక హోటళ్లు, బేకరీలు ఉన్నాయి. వాటిల్లో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పదార్థాలతో వండటం వంటి వాటిని గుర్తించారు. 

రోజుల తరబడిగా నిల్వ ఉంచిన మాంసంతో వండటం వంటివీ గుర్తించారు. హైదరాబాద్‌లో సగం హోటళ్లలో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని, అపరిశుభ్రమైన కిచెన్‌ వంటివి ఉన్నాయని నిర్థారించారు. కేసులు పెట్టి జరిమానాలు విధించడంతోపాటు శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు నేరుగా హాటల్‌కు లేదా రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారుల కంటే, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల ద్వారా అత్యంత నాసిరకమైన ఫుడ్‌ వినియోగదారులకు సరఫరా చేశారని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

దాడులేనా.. సీజ్‌ చేయరా...? 
ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేసి ప్రజల్లో ఒకరకమైన భయం సృష్టించారు. అయితే కుటుంబసభ్యులతో సరదాగానో లేదా అవసరంరీత్యానో హాటళ్లకు వెళ్లే వినియోగదారులకు భరోసా కలి్పంచడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల సమయంలో కుళ్లిపోయిన మాంసం, పాడైపోయిన ఆహారం వంటివి గుర్తించినా, తక్షణమే ఆయా హోటళ్లను ఎందుకు సీజ్‌ చేయడం లేదని వినియోగదారులు ప్రశి్నస్తున్నారు. కేవలం కేసులు పెట్టి వదిలేయడం, పద్ధతి మార్చుకోవాలని సమయం ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని వాపోతున్నారు.  

భరోసా కలి్పంచకపోతే ఎలా? 
హోటళ్లపై దాడులు చేశాక, వాటిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మార్పు రాదు. హోటళ్లలో ధైర్యంగా తినేలా వినియోగదారులకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత అధికారులతోపాటు హోటల్‌ యజమానులపైనా ఉంది. వేలాది రూపాయలు వసూలు చేసే పెద్ద హోటళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్‌ చేసే అధికారం ఉంటుంది. అవసరమైతే కిచెన్‌లోకి వెళ్లి చూసేలా వెసులుబాటు ఉండాలి. లేదంటే ఓపెన్‌ కిచెన్‌ కానీ, సీసీ టీవీ కెమెరాల ద్వారా కిచెన్‌లో ఉండే పదార్థాలు, వండే విధానం వంటి వాటిని తినేవారు నేరుగా స్క్రీన్‌పై చూసే వెసులుబాటు కలి్పంచాలి.         
 శ్రీనివాస్‌ శెట్టి, హైదరాబాద్‌

సీజ్‌ చేసే అధికారం మాకు లేదు  
హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేశాక. వాటిని సీజ్‌ చేసే అధికారం మాకు లేదు. కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం వరకే మాపని. అయితే తక్షణమే సీజ్‌ చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది. వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తున్నాం. హోటల్, రెస్టారెంట్ల యజమానులను పిలిపించి నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాం.  
– ఆర్‌వీ కర్ణన్, కమిషనర్, ఫుడ్‌ సేఫ్టీ

పెద్ద హోటళ్లే ఇలా చేయడం విస్మయం కలిగిస్తుంది 
పెద్ద హోటళ్లే నాసిరకం ఫుడ్‌ పెట్టడంతో డాక్టర్లతో సహా వినియోగదారులంతా విస్మయానికి గురయ్యారు. వీకెండ్‌లో కుటుంబాలతో వెళాదామనుకునే వారికి షాక్‌ ఇచ్చారు. నాసిరకం, కలర్స్‌ వాడిన ఆహారం, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రత వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కేన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆహార ప్రియులకు భరోసా కలి్పంచాలి.  
– డాక్టర్‌ అనిల్‌కుమార్‌ మన్నవ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement