వాహనంలో ఆస్పత్రికి వెళ్తున్న తల్లీపిల్లలు
కోస్గి: వైద్య పరీక్షల కోసం డాక్టర్ వద్దకు వెళ్లొస్తున్న ఓ గర్భిణి ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన బుడగ జంగం లక్ష్మి ఏడు నెలల గర్భవతి. మంగళవారం కడుపులో నొప్పి రావడంతో తల్లితో కలిసి కోస్గి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు.
దాంతో గర్భిణి, ఆమె తల్లి కలిసి రాత్రి 9.15 గంటలకు ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బస్సు కోస్గి పరిధిలోని సంపల్లి శివార్లలో ఉండగా లక్ష్మికి పురిటినొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వగా.. 108 సిబ్బంది అబ్దుల్ అసద్, దేవేందర్ నాయక్ వెంటనే అక్కడికి చేరుకుని.. బస్సులోనే కాన్పు చేశారు. కవల ఆడపిల్లలు జన్మించారు. తర్వాత తల్లీబిడ్డలను 108 వాహనంలో కోస్గి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment