మండపాలకు అందజేయనున్న ఆర్టీఏ
భారీ ట్రేలర్‌ల నుంచి టాటాఏస్‌ల వరకు..
సాక్షి,హైదరాబాద్: గణపతి నిమజ్జన మహోత్సవానికి వాహనాలను అందజేసేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి మండపాలకు అవసరమైన వాహనాలను అందజేసేందుకు రవాణా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకుల నుంచే వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17న నిమజ్జన వేడుకలు జరగనున్న నేపథ్యంలో 16వ తేదీ సోమవారమే వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. సుమారు 2,500 వాహనాలను సిద్ధం చేయనున్నారు.
వారం రోజులుగా కసరత్తు..
నిమజ్జన వాహనాల కోసం వారం రోజులుగా అధికారులు కసరత్తు చేపట్టారు. భారీ ట్రేలర్లు మొదలుకొని లారీలు, డీసీఎంలు వంటి వివిధ రకాల వాహనాల సేకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం గ్రేటర్‌లోని ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈసారి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. వాహనాల కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
సొంతంగా సమకూర్చుకోవడమే కష్టమే..
ఆర్టీఏ వాహనాలను ఏర్పాటు చేసినప్పటికీ మండపాల నిర్వాహకులు సొంతంగానే వాహనాలను సమకూర్చుకొని విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు. చిన్న విగ్రహాల తరలింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. భారీ విగ్రహాల తరలింపునకు ట్రేలర్‌లు, టస్కర్లు వంటి వాహనాలు అవసరం. వాటిని సొంతంగా ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టమే. అలాంటి వాహనాలను ఆర్టీఏ సేకరించి అందజేస్తోంది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాలకు భారీ ట్రేలర్‌ల నుంచి టాటాఏస్‌ల వరకు అందజేయనున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. మండపాల నిర్వాహకులు తమకు అవసరమైన వాహనాల కోసం ఆర్టీఏ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవచ్చు.
12 కేంద్రాల్లో వాహనాలు..
నిమజ్జన వాహనాలను మండపాల నిర్వాహకులకు అందజేసేందుకు గ్రేటర్ పరిధిలో 12 కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల నుంచి మండపాలకు వాహనాలను తీసుకెళ్లవచ్చు. నెక్లెస్ రోడ్డు, మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, నాగోల్, గచి్చ»ౌలి, మన్నెగూడ, పటాన్‌చెరు, వనస్థలిపురం, ఆటోనగర్‌ల నుంచి వాహనాలను మండపాలకు తరలించనున్నారు. మరోవైపు వాహనాలకు చెల్లించాల్సిన అద్దెలను కూడా ఆర్టీఏ అధికారులు ఖరారు చేశారు.
వాహనాల అద్దె సుమారుగా..
👉 భారీ ట్రేలర్‌లు లేదా టస్కర్‌లు రూ.3300 (డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాతో కలిపి)
👉 10 నుంచి 12 టైర్ల సామర్థ్యం హెవీ గూడ్స్ వెహికల్స్‌కు రూ. రూ.4500. డీజిల్ ఖర్చు, డ్రైవర్‌కు రూ.500 బత్తా అదనం.
👉 6 టైర్ల సామర్థ్యం కలిగిన లారీలకు రూ.3000.
👉 మిడిల్ గూడ్స్ వెహికల్స్‌కు రూ.2000.
👉 డీసీఎం వంటి లైట్‌గూడ్స్ వెహికల్స్‌కు రూ.1500.
👉 టాటాఏస్‌లకు రూ.1000 చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.
👉 వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్‌కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment