
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20వ తేదీన హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆయన హైదరాబాద్‌లో విడిది చేస్తారని తెలిసింది. అయితే ఈ షెడ్యూల్ పూర్తిగా ఖరారు కాకపోయినా.. రాష్ట్రపతి వస్తారన్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
కోవిడ్ నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్రపతి ఇక్కడ విడిదికి రాలేదు. కోవిడ్ తగ్గిందనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ పేరుతో మళ్లీ కేసులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రపతి వస్తారా? లేదా? అన్నదానిపై తుది సమాచారం లేదని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా ఉన్నవారు డిసెంబర్‌లో హైదరాబాద్ నగరంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తోంది.