సాక్షి, హైదరాబాద్: పట్టుగూళ్లు పెంచితే సెరికల్చర్.. సాగు చేస్తే లాభాలేలాభాలు.. అప్పుడు దాన్ని సిరికల్చర్ అనొచ్చేమో! ధర రికార్డుస్థాయిలో ఉండటంతోపాటు లాభాలు దండిగా ఉండటంతో రాష్ట్రంలో పట్టుగూళ్ల రైతుల సందడి పెరుగుతోంది. పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచే అవకాశముందని ఉద్యాననిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో ఏడాదిలో 10 నుంచి 11నెలలపాటు సెరికల్చర్‌కు అనుకూల వాతావరణం ఉంటుంది.
మనదేశంలో 36 మిలియన్ టన్నుల పట్టు ఉత్పత్తి చేస్తుండగా వినియోగం 68 మిలియన్ టన్నులు ఉంటోంది. దీంతో మల్బరీ సాగుకు అవకాశాలు పెరిగాయి. 2021–22 కేంద్రం బడ్జెట్‌లో పట్టు దిగుబడిపై వ్యాట్‌ను 7 నుంచి 15 శాతానికి పెంచడంతో చైనా పట్టు దిగుమతులు తగ్గి దేశీయంగా ప్రోత్సహం పెరిగింది. కిలో పట్టు ధరలు రికార్డుస్థాయిలో రూ.730కిపైగా పలుకుతోంది. ఈ నెల రెండున సికింద్రాబాద్ మార్కెట్‌లో కేజీ 685 పలికింది.
రాష్ట్రంలో 12,654 ఎకరాల్లో మల్బరీ సాగు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి 3,176 ఎకరాల్లో ఉన్న మల్బరీ సాగు ఇప్పుడు 12,654 ఎకరాలకు విస్తరించింది. రాష్ట్ర అవసరాలు 984 టన్నులు కాగా 306.6 టన్నుల సిల్క్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో 6,500 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో మల్బరీ సాగును వరికి ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తే బాగుంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
పట్టు ఉత్పత్తి ఇలా... : పట్టుపురుగులు మల్బరీ ఆకులను ఆహారంగా తిని 30 రోజుల్లో నాలుగు దశలను పూర్తి చేసుకుంటాయి. చివరిదశలో తన రక్షణ కోసం గూడును ఏర్పాటు చేసుకుంటాయి. ఈ గూడు నుంచే పట్టుదారం ఉత్పత్తి అవుతుంది. ఈ పట్టుతోనే పట్టు వస్త్రాలను తయారు చేస్తారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన పట్టును గద్వాల, పోచంపల్లి, నారాయణపేట్, కొత్తకోటలోని మగ్గం నేత కార్మికులకు అందిస్తోంది.
సెరీకల్చర్‌కు కేంద్ర నిధులు...
సిల్క్ సమగ్ర పేరుతో షెడ్డుకు అయ్యే రూ.4 లక్షల్లో కేంద్రం రూ.2 లక్షలు గ్రాంట్ ఇస్తోంది. మల్బరీ మొక్కలను కిసాన్ నర్సరీల ద్వారా అందిస్తోంది. యూనిట్ ధర రూ.1.50 లక్షలుకాగా, 50 శాతం రాయితీ కల్పిస్తోంది. ప్లాంటేషన్‌కు అయ్యే ఖర్చు రూ.50 వేలల్లోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. సెరికల్చర్ పథకాల్లో సబ్సిడీలో కేంద్రంవాటా 65 శాతం, రాష్ట్రం 25 శాతం, 10 శాతం రైతు భరించే విధంగా పథకాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment