సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. డీఈవో, డీఎస్‌ఈతో పాటు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అధికారులు ఇతర జిల్లాలకు చెందిన టీచర్లను కూడా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్నారని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ టి.శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని, కేడర్‌ను మించిపోతే ఈ జిల్లాకు చెందిన తాము నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి బదిలీలు చేపడుతున్నారు. దీనిపై పిటిషనర్ల అభ్యంతరాలకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
అయితే తుది సీనియారిటీ జాబితాను జారీ చేయకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం లేదని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. లంచ్‌మోషన్‌లో పిటిషన్ వచ్చినందున వివరాలు తెలుసుకోవడానికి ఈనెల 19 వరకు సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ, అప్పటివరకు బదిలీలు, పదోన్నతులు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment