సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల భూమిపై హైకోర్టు వెలువరించిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌లో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిశీలించి విచారణ అర్హతను తేలుస్తామని చెప్పిన హైకోర్టు.. ఆ వ్యక్తులకు భూములపై హక్కులున్నాయని తీర్పు చెప్పడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ మేరకు రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శిని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఆ 84 ఎకరాలు ప్రభుత్వానివేనని.. కొందరు తప్పుడు పత్రాలతో ఆ భూమిపై హక్కులు పొందారని చెప్పారు.
గత ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. భూములపై బూర్గుల రామకృష్ణ, లింగమయ్య దాఖలు చేసిన రిట్లు విచారణార్హత తేల్చుతామన్న హైకోర్టు ఏకంగా వాళ్ల భూహక్కులపై ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువరించడం సరికాదన్నారు. ప్రైవేట్ వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, న్యాయవాది అశోక్ ఆనంద్ వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించాక దానిపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలే తప్ప.. మళ్లీ హైకోర్టుకు రాకూడదన్నారు. ప్రభుత్వ వాదనను అనుమతించవద్దని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment