మంచిర్యాలఅర్బన్: గద్దర్ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు.
దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్‌పోర్ట్‌కు గద్దర్ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్‌లో బుల్లెట్ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్‌పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు.
► 1980 సమయంలో నక్సల్స్‌తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు.
► పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు.
► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు.
► 1995లో పీపుల్స్‌వార్ పార్టీ గద్దర్‌ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది.
25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్‌తో
గద్దర్‌పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్‌టైగర్స్ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్‌ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్ గద్దర్ ఒంట్లోనే ఉండిపోయింది.
‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్ తరచూ గుర్తు చేసుకునేవారు.
Comments
Please login to add a commentAdd a comment