సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మారుతాయని, 2023 ఏప్రిల్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తుం దని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. కేసీఆర్ బందిపోటు, కాలనాగు కంటే ప్రమాదకారి అని, పాలుపోసినవారిపై విషంకక్కే అలాంటి వారితో కలిసేది లేదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ పెద్దలంతా తమకు స్వయంగా చెప్పా రన్నారు. అయినా, 2004లో, 2014లో కాంగ్రెస్‌ను నిలువునా మోసం చేసిన బందిపోటుతో తామెందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. వచ్చేనెల 6న వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు.
బైకు ర్యాలీ అనంతరం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ వ్యతిరేక కూటమిలో కలుపుకొనేందుకే కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ (పీకే) సమావేశం జరి గిందంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. ‘ఇటీవల సోనియాగాంధీతో భేటీ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్ సుముఖత వ్యక్తం చేశారు. అప్పుడు పార్టీ అంబికాసోనీ, జైరాం రమేశ్, చిదంబరం, ప్రియాంకాగాంధీ తదితర ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీ వేసింది. దేశంలో ఐప్యాక్ సంస్థ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో తెగదెంపులు చేసుకుంటేనే కాంగ్రెస్‌లో చేరాలని ఆ కమిటీ స్పష్టంచేసింది. అందుకే కాంగ్రెస్‌లో చేరేముందు ఐప్యాక్‌తో తనకు సంబంధాల్లేవన్న విషయం చెప్పడానికే పీకే.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు’ అని రేవంత్ చెప్పారు. పీకే.. కాంగ్రెస్‌లో చేరాక ఐప్యాక్‌కు దూరంగా ఉంటారని మంత్రి కేటీఆర్ కూడా చెప్పారని గుర్తుచేశారు. ఈ లెక్కన తామెక్కడా టీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదన్నారు. ఒకసారి పీకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక, ఆయన పార్టీ కార్యకర్త అవుతారనని రేవంత్ చెప్పారు. పార్టీ ఆ దేశించిన ప్రకారం.. ఆయన దేశంలో మిజోరాం, మేఘాలయ, తెలంగాణ ఇలా ఎక్కడైనా పనిచేయాల్సిందేనన్నారు.
2018 నుంచి 82,400 మంది రైతుల ఆత్మహత్య
‘రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక, పండించిన పంటకు ప్రోత్సాహం లేక అష్టకష్టాలు పడుతున్నారు. 2018 నుంచి 82,400 మంది పైచిలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు మరోసారి తెలంగాణ రైతాంగ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి. రైతులతో వరి వద్దన్న సీఎం మాత్రం 150 ఎకరాల్లో వరి వేసిన విధానాన్ని కాంగ్రెస్ వెలుగులోకి తేవడం, వరుసగా రైతు దీక్షలు చేయడంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చింది’ అని రేవంత్ చెప్పారు.
‘ర్యాడిసన్’ కేసును ఎన్‌సీబీకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 3న ర్యాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరుతూ ఈనెల 14న వినతిపత్రం సమర్పించినా స్పందన లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment