సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చేతగానితనాన్ని ప్రదర్శిస్తుంటే.. ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘రైతు బాంధవున్ని అంటావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులను ఆదుకుం టున్నా అంటావ్. మరి ఇప్పుడు కేంద్రం బియ్యం కొననంటే.. రైతులను ఆదుకునేలా నీ కార్యాచరణ ఏంటి’ అని రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం ఆయన ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వరేసిన రైతులను ఉరేస్తాం అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మెడపై కత్తి పెట్టి రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపైనా రేవంత్ ఘాటుగా స్పందించారు. మెడపై కత్తిపెడితే నీ సీఎం పదవి, ఫాంహౌస్ రాసిస్తవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్రానికి ఎలా కట్టబెడతావ్ అంటూ మండిపడ్డారు. కేంద్రం నీ మెడపై కత్తి పెట్టగానే బియ్యం ఇవ్వనని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్నావా అని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు చేసేలా కేసీఆర్ జంతర్‌మంతర్‌లో దీక్ష చేయాలని, కేసీఆర్ సచ్చుడో..కేంద్రం ధాన్యం కొనుగోలు చేసుడో తేల్చుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక ఉద్యమాలు చేస్తామని చెప్పారు.
చీకటి రాజకీయాలతో రెండు పార్టీల మోసం..
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. లోక్‌సభను అడ్డుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నించిందని విమర్శించారు. రైతులపై టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కవిత, దయాకర్ సభకు ఎం దుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment