తక్కువ ఖర్చుతో స్వల్ప కాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులపై సర్కారు దృష్టి
గోదావరి బేసిన్‌లోని ఆరు ప్రాజెక్టులు ఎంపిక
రూ.241 కోట్ల అంచనా వ్యయం.. 48 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని రేవంత్‌రెడ్డి సర్కారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చివరి దశలో ఉన్న పాత ప్రాజెక్టులను, ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని సత్వరంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆయన నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. గోదావరి పరీవాహకంలోని నీల్వాయి, పింప్రి, పాలెంవాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ– 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా, ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. రూ.18.47 కోట్లు ఖర్చు పెడితే నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లాలో 2,632 ఎకరాలకు సాగునీరు అందనుంది.
రూ.17.02 కోట్లతో పాలెంవాగు ప్రాజెక్టు ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,632 ఎకరాలకు నీరు అందనుంది. పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వంద శాతం పనులు పూర్తి చేయాలని గడువు నిర్దేశించుకున్నారు.
కాల్వలు, డి్రస్టిబ్యూటరీలపై దృష్టి
కృష్ణా, గోదావరి బేసిన్లలో ఆగి పోయిన ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి తెప్పించుకుని పరిశీలించారు. ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్ నిర్మాణంపైనే కాకుండా ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డి్రస్టిబ్యూటరీ వ్యవస్థలపై సైతం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌసులకే పరిమితమైన ట్టు విమర్శలున్నాయి. అప్పులు తెచ్చి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా హెడ్‌వర్క్స్ మాత్రమే పూర్తి కాగా, ఆయకట్టుకు నీటిని అందించే మెయిన్ కాల్వలు, డి్రస్టిబ్యూటరీల నిర్మాణాన్ని ప్రారంభించనే లేదు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షిత కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. దీంతో ఇకపై కాల్వ లు, డిస్ట్రిబ్యూటరీలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment