
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని రోహిణి జైల్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.200 కోట్ల బెదిరింపు వసూళ్ల కేసు లింకులు సిటీలో బయటపడ్డాయి. ఆ మొత్తం నుంచి కొంత హైదరాబాద్‌లోని ఓ షెల్ కంపెనీకి బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీ వ్యవహారాలను సేకరించడంతో పాటు నిర్వాహకులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
►ఢిల్లీకి చెందిన ఘరానా మోసగాడు, గ్యాంగ్‌స్టర్ సుఖేష్ చంద్రశేఖర్ కొన్నాళ్లుగా అక్కడి రోహిణి జైల్‌లో ఖైదీగా ఉన్నాడు. ఇతడి అనుచరులు అవినాష్ కుమార్, జితేందర్ నారూలా కూడా ఇతడితో పాటే అరెస్టు కావడంతో అదే జైల్లో ఉంచారు.
►ఢిల్లీలోని రెలేగీ ఫైనాన్స్ సంస్థలో భాగస్వామి అయిన సుఖ్‌వీర్‌ను మోసం చేయడంతో పాటు ఆయన భార్య ఆదితిని బెదిరించిన ఆరోపణలపై వీళ్లు అరెస్టు అయ్యారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండటంతో అక్కడి అధికారులతోనూ సుఖేష్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరు సన్నిహితంగానూ మారారు.
►తన అనుచరులు ఇద్దరితో కలిసి సుఖేష్ జైలు నుంచే దందా చేయడానికి పథకం వేశాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారులను బెదిరించడం ద్వారా వసూళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్న ఈ త్రయం రంగంలోకి దిగింది. దీనికోసం సుఖేష్ తన ప్రియురాలు లీనా మారియా పౌల్ సహాయం తీసుకున్నాడు.
►ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారుల వివరాలు సేకరించిన లీనా వాటిని ఎప్పటికప్పుడు సుఖేష్‌కు అందిస్తూ వచ్చింది. ములాఖత్‌లో కలిసిన ప్రతి సందర్భంలోనూ వీళ్లు ఇదే విషయాలు చర్చించారు. ఎట్టకేలకు కరోల్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు.
►ఆయనతో పాటు కుటుంబీకులు సైతం వ్యాపారులే కావడంతో సుఖేష్ భారీ మొత్తం వసూలు చేయాలని పథకం వేశాడు. వారిపై రెక్కీ నిర్వహించాల్సిన బాధ్యతలను బయట ఉన్న తన అనుచరులకు అప్పగించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏడుగురు ఆ పని పూర్తి చేసి ములాఖత్‌లో వివరాలు అందించారు.
►డిప్యూటీ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదాల్లో ఉన్న ఐదుగురు అధికారులూ సుఖేష్‌తో జట్టు కట్టారు. నైతిక మద్దతు ఇవ్వడం ద్వారా పరోక్షంగా, సెల్‌ఫోన్లు అందించడం ద్వారా ప్రత్యక్షంగా రోహిణి జైల్‌కు చెందిన ఐదుగురు సుఖేష్‌కు సహకరించారు.
►బయట ఉన్న అనుచరుల ద్వారా టార్గెట్ చేసిన ఢిల్లీ వ్యాపారితో పాటు అతడి కుటుంబీకుల కదలికలు తెలుసుకుంటున్న సుఖేష్ వారికి ఫోన్లు చేయడం ద్వారా బెదిరింపులకు దిగాడు. ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం రెండు నెలల పాటు వారి నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు.
►ఆ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో తీసుకోకుండా అనేక షెల్ కంపెనీల్లోకి మళ్లించేలా చేశాడు. ఇందులో రూ.20 కోట్లను సుఖేష్ రోహిణి జైలు అధికారులకు పంచాడు. మిగిలింది షెల్ కంపెనీల ద్వారా తన అనుచరులకు చేరేలా చేశాడు.
►ఆగస్టు నెలాఖరులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీ ఈఓడబ్ల్యూ అధికారులు కేసు నమోదు చేశారు. సుఖేష్, లీనా సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసి వారిపై చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. సోమవారం రోహిణి జైల్ అధికారులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీతో పాటు ఎంకోకా చట్ట ప్రకారం అభియోగాలు మోపారు.
►ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈఓడబ్ల్యూ అధికారులకు సుఖేష్ వసూలు చేసిన మొత్తం హాంగ్‌కాంగ్‌తో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లో ఉన్న షెల్ కంపెనీలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ మొత్తంలో 7 శాతం కమీషన్‌గా తీసుకున్నవాటి నిర్వాహకులు హవాలా రూపంలో డబ్బు సుఖేష్ చెప్పిన వారికి అందించినట్లు తేల్చారు.
►దీంతో ఆయా షెల్ కంపెనీల నిర్వాహకులు, హవాలా ఏజెంట్లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన కంపెనీ సనత్‌నగర్ చిరునామాతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నిర్వాహకుల వివరాలు ఆరా తీసి..పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి వచ్చింది.
►ఈఓడబ్ల్యూ అధికారులు రిజ్రిస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచీ ఈ కంపెనీ వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఢిల్లీ పోలీసుల రాక, వారి కదలికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఇక్కడి పోలీసులు చెప్తున్నారు. వీలున్నంత వరకు వాళ్లు నేరుగానే పని చేసుకుంటారని, అవసరమైన పక్షంలో తమ సహాయం కోరతారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment