సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగులో ఉన్న ఐదు డీఏలకుగాను కొత్తగా మరో రెండు డీఏలను సంస్థ ప్రకటించింది. దీంతోపాటు గత దసరా పండుగ సందర్భంగా ఇవ్వలేకపోయిన పండుగ అడ్వాన్సును, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సకలజనుల సమ్మె కాలపు వేతనపు బకాయిలను కూడా చెల్లించనున్నట్టు వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్యతో శుక్రవారం సమావేశమైన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేయనున్నట్టు ఆ సమాఖ్య సంకేతాలిచ్చింది. సమాఖ్య ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వారం రోజుల క్రితం చర్చించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి వచ్చాక డిమాండ్లపై చర్చించి మళ్లీ వివరాలు వెళ్లడిస్తామని ఆ భేటీలో వారు పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా ఆర్టీసీ చైర్మన్ వారితో శుక్రవారం భేటీ అయ్యారు. డిమాండ్లలో 2డీఏల చెల్లింపు, దసరా పండుగ అడ్వాన్సు చెల్లింపు, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులకు సకలజనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు, విశ్రాంత ఉద్యోగులకు బకాయి ఉన్న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులను అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
అయితే, ప్రధాన డిమాండ్లయిన వేతన సవరణ, బాండ్ల డబ్బు చెల్లింపు, కార్మిక సంఘాల పునరుద్ధరణ, సీసీఎస్, పీఎఫ్ బకాయిల చెల్లింపులపై హామీ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమాఖ్య ప్రతినిధులు సమావేశం అర్ధంతరంగా ముగించారు. నెరవేర్చే అంశాలకు సంబంధించిన నిర్ణయాలను స్వాగతిస్తున్నామని, కానీ ప్రధాన డిమాండ్ల విషయంలో దాటవేత ధోరణనిని నిరసిస్తున్నామని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సమాఖ్య సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించుకుని మునుగోడు ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఆర్టీసీ ఎండీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఎన్నికల కోడ్‌వల్లే..
ప్రస్తుతం మునుగోడు ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయలేకపోతున్నామని బాజిరెడ్డి వెల్లడించారు. 2019 తాలూకు డీఏకు సంబంధించి బకాయిల కింద రూ.20 కోట్లు విడుదల చేస్తున్నామని, మరో రెండు డీఏల అమలుకు గాను రూ.15 కోట్లు, సకల జనుల సమ్మె కాలానికి సంబంధించి 8053 మంది విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనం కింద రూ.25 కోట్లు, విశ్రాంత ఉద్యోగులకు బకాయి ఉన్న లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించి రూ.20 కోట్లు, పండుగ అడ్వాన్సు కింద (క్రిస్టియన్లకు కూడా)రూ.20 కోట్లు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు రాత్రి సర్క్యులర్లు జారీ అయ్యాయి. 3 వేల కోట్ల వరకు ఉన్న పెండింగు బకాయిల చెల్లింపు డిమాండ్ చేయగా, కేవలం రూ.100 కోట్లను మాత్రమే విడుదల చేయటం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్‌ను అడ్డు పెట్టుకుని ప్రధాన డిమాండ్లను దాటవేయటం సరికాదని, గతంలోనే ప్రకటించిన వేతన సవరణ బకాయిలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలకు కోడ్ అడ్డురానప్పుడు వీటికి ఎందుకు వస్తుందని ప్రశ్నించాయి.
డిమాండ్లలో రూ.100 కోట్ల విలువైన వాటికి నిధులు విడుదల చేయటాన్ని స్వాగతిస్తున్నామని, ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవటాన్ని తప్పుపడుతున్నామని కారి్మక సంఘాల నేతలు కమాల్‌రెడ్డి, నరేందర్, నాగేశ్వర్రావు, రాజిరెడ్డి తదితరులు తెలిపారు. ప్రజా రవాణా అవసరాలరీత్యా కొత్తగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులు కొంటున్నట్టు ఎండీ సజ్జనార్ చెప్పారు. 360 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచినట్టు పేర్కొన్నారు. వీటిని ఇంటర్‌సిటీ కనెక్టివిటీగా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు నడపనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment