
సాక్షి, హైదరాబాద్: కొత్త లబ్ధిదారులకు రైతుబంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదు వరకు కటాఫ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)కి అందజేయాలి.
ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్‌ను ఓపెన్ చేశారు. సీసీఎల్‌ఎ డేటా ఆధారంగా రైతుల వివరాలను అధికారులు అప్‌లోడ్ చేస్తారు. ముందుగా కటాఫ్ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లబ్ధిదారుల నమోదుకు రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించటంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
అయితే ఒకవైపు మంగళవారం రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా, మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పదిహేను రోజుల వరకు నగదు బదిలీ చేస్తారని, ఇదే సమయంలో ఏఈవోలు రైతుబంధు పోర్టల్లో కొత్త లబ్ధిదారులను కూడా నమోదు చేస్తారని చెబుతు న్నారు. టైటిల్ క్లియరెన్స్ వచ్చిన భూమి విస్తీర్ణం పెరిగితే నిధులు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment