
యోగాసనాలు వేస్తున్న బాబా రామ్‌దేవ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
నందిగామ: యోగా, ధ్యానం మన జీవితంలో అంతర్భాగం కావాలని కేంద్రమంత్రి శర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హార్ట్‌ఫుల్ నెస్ ఇన్‌స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హార్ట్‌ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శర్భానంద హాజరయ్యారు.
యోగా గురు రామ్‌దేవ్ బాబా, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..75 కోట్ల సూర్య నమస్కారాలు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కమ్లేష్ డి.పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా అకాడమీని స్థాపించడం ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుందని అన్నారు.
గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా సాధన చేయాలని, అలాంటి వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment