సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పలు లే అవుట్లలో పార్కులు, క్రీడా స్థలాలు తదితరాల కోసం వదిలిన ఖాళీస్థలాల్లో వాటిని ఏర్పాటు చేయకుండా యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఖాళీ స్థలాలంటూ లేకుండా నగరంలో లంగ్‌స్పేస్ కరువవుతోంది. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం రెండు నెలల క్రితం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన అసెట్స్ ప్రొటెక్షన్ సెల్ (ఏపీసీ)కు అందుతున్న ఫిర్యాదులతో ఇలాంటి ఆక్రమణలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు పార్కుల కోసం వదిలిన స్థలాలు కబ్జాల పాలైన ఘటనలు వెలుగు చూడగా.. సెప్టిక్ ట్యాంక్ కోసం వదిలిన స్థలాన్ని కూడా ఆక్రమించి రెండు ఇళ్లు నిర్మించిన ఘటన బయటపడింది. ఏపీసికి అందిన ఫిర్యాదుతో సంబంధిత అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి క్షేత్రస్థాయి తనిఖీలు చేశారు.
కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని హుడా లే అవుట్‌లోని సర్వే నంబర్ 336లో సెప్టిక్ ట్యాంక్ కోసం వదిలిన స్థలంలో రెండు ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు. 924 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన వీటికి సంబంధించి యాజమాన్య హక్కులు, ఇళ్ల నిర్మాణానికి పొందిన అనుమతి పత్రాలు చూపాల్సిందిగా కోరగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టిక్ ట్యాంకుకు వదిలిన స్థలంలోని ఇళ్లను ఈ నెల 10న కూల్చివేసినట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి ఎవరైనా టోల్‌ఫ్రీ నంబర్ 1800–599–0099కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment