సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప సన్నిధికి చేరేందుకు భక్తజన సందోహం పడిగాపులు కాస్తోంది. రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ఈసారి భారీ సంఖ్యలోనే మాలధారణ గావించారు. డిమాండ్‌కు తగిన రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒకటే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్‌లో ఇప్పటికే ‘నో రూం’ దర్శనమిస్తోంది.
మరోవైపు జంటనగరాల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఫిబ్రవరి వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప భక్తులు శబరికి వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈసారి ఎక్కువ మంది భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగిస్తున్నాయి.
ఉన్నది ఒక్కటే..
► సాధారణంగా ప్రతి ఏటా కనీసం 2.5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య తగ్తింది. ఈసారి లక్ష మందికి పైగా మాలధారణ చేసినట్లు అంచనా. ప్రతి రోజు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడం వల్ల శబరికి వెళ్లే భక్తుల సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు. కానీ కనీసం 30 వేల మందికి పైగా భక్తులు వెళ్లే అవకాశం ఉంది.
► హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరో నెల రోజుల వరకు కనీసం టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు. ఈసారి ఇప్పటి వరకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు.
సంక్రాంతి ప్రయాణమూ కష్టమే..
► ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఫిబ్రవరి వరకు వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు దాటింది. జనవరి, ఫిబ్రవరి నెలల కోసం అన్ని రైళ్లలో బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు.
► విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తే తప్ప ఊరెళ్లడం సాధ్యం కాదు. మరోవైపు జనవరి మొదటి వారానికే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటిపోయింది.
ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోత...
► రైళ్ల కొరత కారణంగా అయ్యప్ప భక్తులు, సంక్రాంతికి సొంత ఊరు వెళ్లే సాధారణ ప్రజలు సైతం ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహణాలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment