పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి సర్కారు శ్రీకారం
మార్చి 9వ తేదీ వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్..
ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక బృందాలు
వ్యవసాయ అధికారులు, డీటీలు, సర్వేయర్లు, పారాలీగల్ సిబ్బందితో ఏర్పాటు
మాడ్యూల్ లేదా గ్రామాల వారీగా దరఖాస్తుల పరిశీలన
అన్ని రికార్డుల పరిశీలన అనంతరం తహసీల్దార్ స్థాయిలోనే నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం (మార్చి 1) నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిట్టల్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
►తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ టీమ్‌లలో తహసీల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితోపాటు పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించాలి. వారికి దీనికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పించాలి.
►పెండింగ్ దరఖాస్తులను మాడ్యూళ్లు లేదా గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలి.
►దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వీఆర్వోల ద్వారా లేదంటే వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సదరు దరఖాస్తుదారులకు పంపాలి.
►సేత్వార్, ఖస్రా, సీస్లా పహాణి, ఇతర పాత పహాణీలు, పాత 1బీ రిజిస్టర్లు, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితోపాటు వచి్చన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలించాలి. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేయాలి.
►అవసరమనుకుంటే ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలి. స్థానికంగా సదరు భూముల గురించి విచారించాలి. చివరిగా నివేదికను రూపొందించి.. సదరు దరఖాస్తును ఆమోదించాలా, తిరస్కరించాలా అన్నది పొందుపర్చాలి.
► ప్రత్యేక బృందాల నివేదికలను తహసీల్దార్లు పైస్థాయి అధికారులకు పంపాలి. వారు వాటిని పరిశీలించి దరఖాస్తు ఆమోదానికి లేదా తిరస్కారానికి గల కారణాలను తెలియజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
►ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి. ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండకూడదు. ఇందుకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment