సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌లో ఇంకో టీకా అందుబాటులోకి వచ్చేసింది. రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఇకపై భారత్‌లోనూ తయారుకానుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న టీకాలనే భారత్‌లో వినియోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో పోలిస్తే స్పుత్నిక్–వి కొంచెం భిన్నమైన టీకా. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌తో కోవాగ్జిన్ టీకా తయారైతే.. కోవిషీల్డ్‌లో కరోనా వైరస్ కొమ్ములను పోలిన వాటిని వినియోగించారు. ఈ రెండు పద్ధతుల కంటే భిన్నంగా స్పుత్నిక్–వి తయారైంది. రెండు డోసుల ఈ టీకాలో రెండు వేర్వేరు అడినోవైరస్‌లను ఉపయోగించారు. సాధారణ జలుబుకు కారణమైన ఏడీ26, ఏడీ5 వైరస్‌లతో రెండు డోసులు సిద్ధమవుతాయి.
తొలిడోసులో ఏడీ26 వైరస్ ఉంటే.. రెండో డోసులో ఏడీ5 వైరస్ ఉంటుంది. ఈ మిశ్రమం వల్ల శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవాగ్జిన్ విషయంలో రెండు డోసుల మధ్య అంతరం 4 నుంచి 6 వారాలైతే.. కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలు. బ్రిటన్‌లో 8 వారాల గడువు తర్వాతే రెండో డోస్ ఇస్తున్నారు. స్పుత్నిక్–వి విషయానికి వచ్చేసరికి మూడు వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇచ్చేయొచ్చని చెబుతున్నారు. కోవాగ్జిన్ టీకా సామర్థ్యం 83 శాతం ఉంటే.. కోవిషీల్డ్ సామర్థ్యం 70 నుంచి 90 శాతమని అందుబాటులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. స్పుత్నిక్–వి సామర్థ్యం 91.6 శాతం అని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు.
దుష్ప్రభావాలు ఉంటాయా?
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచంలో తొలిసారిగా తయారైన వ్యాక్సిన్‌గా స్పుత్నిక్–వి రికార్డు సృష్టించింది. గతేడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని, వారికి తేలికపాటి జ్వరం తప్ప ఎలాంటి దుష్ప్రభావాలు కన్పించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని కచ్చితంగా చెప్పలేం. మానవ ప్రయోగాల సందర్భంగా నమోదు చేసిన వివరాల ప్రకారం స్పుత్నిక్–వి తీసుకున్న వారిలో కొందరికి తలనొప్పి, నిస్సత్తువ, జలుబు టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి లాంటి లక్షణాలు కన్పించాయి. అయితే ఇవన్నీ కొంత కాలంలోనే సర్దుకున్నాయని తెలుస్తోంది. ఇంతకు మించిన తీవ్రమైన దుష్ప్రభావాలేవీ ఇప్పటివరకు నమోదు కాలేదు.
కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే?
Published Sun, May 16 2021 1:49 AM | Last Updated on Sun, May 16 2021 2:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment