బంకర్‌లో తలదాచుకున్న బాధితులు
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి పగలూ తేడా లేకుండా బాంబుల మోతలు.. సైరన్‌ల హెచ్చరికలు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ.. మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నాం’. అని ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినితియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు శనివారం ఉదయమే అక్కడి నుంచి రొమేనియాకు చేరుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రొమేనియా సహా పోలెండ్, హంగేరీ తదితర దేశాలకు జనం తరలి వెళ్లడంతో రాకపోకలు స్తంభించాయి.
►ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో పొరుగుదేశాలకు తరలించి అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ వాహనాల రద్దీ కారణంగా చాలా మంది రొమేనియా తదితర పొరుగు దేశాలకు చేరుకోవడం కష్టంగా మారింది.
సైరన్ మోగినప్పుడు స్తంభించిన వినితియా నగరంలోని ఓ రహదారి
►ఈ క్రమంలోనే వినిత్స నుంచి రొమేనియాకు బయలుదేరిన సుమారు 300 మంది విద్యార్థులు (కొంతమంది తెలుగు వారు కూడా) చివరి క్షణంలో భారత రాయబార కార్యాలయం నుంచి అనుమతి లభించకపోవడంతో నిలిచిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
►రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నామని, తమను తక్షణమే ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి వినోద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’కి వివరించారు.
సైరన్ మోగితే పరుగులే...
►వినితియా మెడికల్ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు స్థానికంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మొదటి నుంచి యుద్ధ భయాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలు తమ ఇళ్ల నిర్మాణంలో భాగంగా బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక బంకర్ ఉంటుందని, సైరన్ మోగగానే అందరు వెళ్లి అందులో తలదాచుకుంటారని వినోద్ తెలిపారు.
►మూడు రోజులుగా ఎప్పుడు బంకర్ మోగితే అప్పుడు తామంతా బంకర్‌లకు పరుగులు తీస్తున్నామని వాపోయారు. వినితియాకు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో బాంబుల మోత వినిపిస్తోందని, ఏ క్షణంలో తాము ఉన్న నగరానికి యుద్ధం ముంచుకొస్తుందో తెలియడం లేదని చెప్పారు. నగరంలోని ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, పిర్జాదిగూడ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్ధులు జెప్రోజియా, వినితియా విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధానికి ముందే
కొందరు భారత్‌కు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది అక్కడే ఉండిపోయారు.
కొరవడిన స్పష్టత..
భారత రాయబార కార్యాలయం ప్రకటనల్లో స్పష్టత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘మొదట అందరూ బయలుదేరాలని ప్రకటించారు. తీరా సామగ్రి సర్దుకొని వెళ్లేందుకు సిద్ధమైన అనంతరం ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ప్రకటించారు. తాము ఉన్న చోట భద్రత ఉంటే అక్కడే ఉండిపోవాలని చెబుతున్నారు. కానీ ఇలా భయం భయంగా ఎంతకాలం బతకాలి’ అని వినోద్ ఆవేదన వక్యం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, సరిహద్దు దేశాలకు చేరుకొనేందుకు అవకాశం లేక, రాత్రింబవళ్లు బంకర్‌లలో తలదాచుకోలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment