‘మత్తు’ వదిలించండి.. సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు | Strict Action Should Be Taken No Matter How Many Culprits KCR | Sakshi
Sakshi News home page

‘మత్తు’ వదిలించండి.. సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

Published Wed, Jan 26 2022 6:09 PM | Last Updated on Thu, Jan 27 2022 3:40 PM

Strict Action Should Be Taken No Matter How Many Culprits KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై సీఎం కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారు. మత్తు పదా ర్థాల మాఫియాను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు ఆదేశించారు. విద్యార్థులు, యువత భవిష్యత్‌ను ఛిద్రం చేస్తున్న మత్తు వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణకు నార్కోటిక్‌–ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కం ట్రోల్‌ సెల్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయిం చారు. పోలీస్, ఎక్సైజ్‌ విభాగాల నుంచి వెయ్యి మందితో దీన్ని ఏర్పాటుచేయాలని, నిందితులు ఎంతటి వారైనా శిక్షించేలా కఠిన చర్యల అమ లుకు ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు.

ముఖ్యమంత్రి బుధవారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరా బాద్‌ నగర కమిషనర్‌ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో డ్రగ్స్‌ నియంత్రణకు చేపట్టా ల్సిన చర్యలపై చర్చించారు. దీనికి సంబంధిం చిన కార్యాచరణ కోసం పోలీస్, ఎక్సైజ్‌ విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హోంమంత్రితోపాటు డీజీపీ, అదనపు డీజీపీలు, ఐజీలు, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులంతా పాల్గొనాలని ప్రభు త్వం ఆదేశించింది. 

ఐజీ లేదా అదనపు డీజీ నేతృత్వంలో...
కొత్తగా ఏర్పాటుకానున్న నార్కోటిక్‌ అండ్‌ ఆర్గౖ¯నైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌కు అదనపు డీజీపీ లేదా ఐజీ ర్యాంకు అధికారిని ఇంచార్జిగా నియమించాలని భావిస్తున్నారు. దీనికోసం గతంలో అనేక డ్రగ్‌ కేసులను ఛేదించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పేరును పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పోలీస్, ఎక్సైజ్‌ విభాగాల నుంచి ఇద్దరు అదనపు ఎస్పీ ర్యాంకు అధికారులు, ఆరుగురు డీఎస్పీ ర్యాంకు అధికారులు, 18 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గతంలో నగర టాస్క్‌ఫోర్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌లో పనిచేసిన అనుభవం ఉన్న కింది స్థాయి సిబ్బందిని తీసుకోవడంతోపాటు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో చురుగ్గా పనిచేస్తున్న కానిస్టేబుళ్లను ఇందులోకి తీసుకోనున్నారు. 

పోలీస్‌ శాఖ స్పెషల్‌ యాప్‌
డ్రగ్స్, గంజాయి నేరాలకు పాల్పడే వారి వివరాలు అన్ని పోలీస్‌ స్టేషన్లలోని అధికారులకు తెలిసేలా పోలీస్‌ శాఖ ఓ యాప్‌ను రూపొందించింది. నిందితుల నేరచరిత్ర, గతంలో వారు ఎక్కడ ఏ డ్రగ్‌ కేసులో అరెస్టయ్యారు, ప్రస్తుతం జైల్లో ఉన్నారా లేదా విడుదలయ్యారా లాంటి అనేక వివరాలను మానిటరింగ్‌ చేసేలా డోపమ్స్‌ (డ్రగ్స్‌ అఫెండర్‌ ప్రొఫైలింగ్, అనాలిసిస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్స్‌) అనే యాప్‌ను తయారుచేసింది. దీనివల్ల పదే పదే డ్రగ్‌ కేసులకు పాల్పడే వారిని నియంత్రించడంతోపాటు వారి కదలికలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

ఆపరేషన్‌ గాంజా సక్సెస్‌
రాష్ట్రంలో వేళ్లూనుకుపోతున్న గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఇంతకుముందు పోలీస్‌–ఎక్సైజ్‌ విభాగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్‌ గాంజా’ చేపట్టాయి. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ 1,316 కేసులు నమోదు చేసి, 2,875 మందిని అరెస్ట్‌ చేసింది. 35,165 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 36,540 గంజాయి మొక్కలను ధ్వంసం చేసింది. అటు ఎక్సైజ్‌ విభాగం సైతం భారీ స్థాయిలోనే గంజాయి సాగు నియంత్రణతోపాటు రవాణా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టింది. 980 కేసులను నమోదు చేసి, 1,200 మందిని అరెస్ట్‌ చేసింది. నాలుగు టన్నులకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకుని, మరో 2 టన్నులకుపైగా సాగు చేస్తున్న గంజాయిని ధ్వంసం చేసింది. 

ఇక్కడ చదవండి: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement