
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాల మధ్యవర్తిత్వం వహించడంతో సమ్మెను బేషరతుగా విరమించుకున్నట్టు .. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ 82), ఎంఐఎం అనుబంధ ఇతెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి.
తమ డిమాండ్ల సాధనకు ఈ రెండు యూనియన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వగా, విద్యుత్ సంస్థలపై పాక్షిక ప్రభావం కనబడింది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ల ముఖ్య నేతలతో సహా 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ల నాయకుల విజ్ఞప్తితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సీఎండీతో ఫోన్‌లో మాట్లాడారు.
తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటాం..
తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ఒవైసీ కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ..బేషరతుగా సమ్మె విరమిస్తే 10 రోజుల్లోగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతేహాద్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అహమద్ బలాల రెండు యూనియన్ల నేతలతో కలిసి విద్యుత్ సౌధలో ప్రభాకర్ రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డిని కలిసి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్టు హెచ్–82 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, ఇతెహాద్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్‌లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా ఆర్టిజన్లకు రూ.16లక్షల గ్రాట్యుటీతో పాటు మెడికల్ అన్‌ఫిట్ పథకం కింద కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారని సాయిలు వెల్లడించారు.
సమ్మె తొలిరోజే 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బుధవారం రెండోరోజు సమ్మెకు ఆర్టిజన్లు సుముఖత వ్యక్తం చేయలేదని, ఈ కారణంగానే విరమణ ప్రకటన చేయాల్సి వచ్చిందని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment