
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత కోల్పోయి ఇతర జోన్లు, జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగులను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు.
సీనియారిటీపై అప్పీల్స్, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రకటనలకే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పేద వర్గాలకు ఉపయోగకరమే అయినప్పటికీ తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేస్తే ఆయా వర్గాలకే నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలన్నారు.
22న ఆన్‌లైన్ బహిరంగ సభ..
ఈ నెల 22 నుంచి 25 వరకు పార్టీ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నాయకులు ప్రసంగిస్తారన్నారు.