మహాసభల్లో టేబుల్‌టాప్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రకాశ్ కారత్, జూలకంటి, తమ్మినేని, రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడి.. పార్టీపరంగా ప్రజల్లో బలపడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ తీర్మానించింది. టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక పాలనను అడ్డుకోవాలని, బీజేపీని నిలువరించాలని పిలుపునిచ్చింది.
కమ్యూనిస్టుల మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వామపక్షాలు చేపట్టే పోరాటాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో 54 అంశాలపై సోమవారం తీర్మానాలు చేసింది.
పోటీ, పొత్తు అంశాన్ని పక్కన పెట్టి..
ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ, పొత్తులు అనే అంశాన్ని పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపైనే మహాసభల్లో ఎక్కువ చర్చ జరిగినట్లు స్పష్టం చేసింది. యువతను, మహిళలను, అణగారిన వర్గాలను పెద్దఎత్తున సమీకరించి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ ప్రజా పోరాటంలో కలిసి వచ్చే వామపక్ష, లౌకిక శక్తులను కలుపుకొనిపోవాలని నిర్ణయించింది. మహాసభల ప్రాంగణంలో పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, నాగయ్య, సుదర్శన్ సహా జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్‌లు ఈమేరకు మీడియాకు వెల్లడించారు.
టీఆర్‌ఎస్ డాంబికాలు
‘తెలంగాణ ధనిక రాష్ట్రమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని డాంబికాలు పలికినా ఎప్పుడూ లేనంత వేగంగా గత ఏడేళ్లలో అప్పులు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం అవి రూ.2,86,000 కోట్లకు చేరాయి. అదీగాక, 20 శాతానికి మించి పంట రుణాలు అందటం లేదు. అసైన్డ్ భూములు, పోడు భూములు గుంజుకుంటున్నారు. కోవిడ్ కేసులు, మరణాలు తక్కువ చేసి చూపుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకిస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడంలేదు’అని సీపీఎం పేర్కొంది.
బలపడాలని చూస్తున్న బీజేపీ
రాష్ట్రంలో ఉన్న ప్రజల అసంతృప్తిని ఆసరా చేసుకొని బీజేపీ బలపడాలని చూస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. ‘ప్రజల అసంతృప్తిని భావోద్వేగాలవైపు మరల్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేశారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు’అని మండిపడింది.
బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించటంలోనూ, లౌకిక విధానాల కోసం నిలబడటంలోనూ టీఆర్‌ఎస్ అవకాశవాదం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టింది. కాంగ్రెస్ వైఖరి కూడా బీజేపీ బలపడటానికే ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment