సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకువచ్చింది. అందులో భాగంగానే 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది.
విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లను తీసుకువచ్చింది. కాగా, ఈ సంస్కరణలు 2022-23 నుంచి అమలులోకి రానున్నాయి. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులతో పరీక్ష విధానం ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు ఇవ్వనున్నారు. ఫిజిక్స్, బయాలజీకి సగం సగం మార్కులు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. టెన్త్ పరీక్షలు ఆరు పేపర్లకు కుదించాము. వంద శాతం సిలబస్తో పరీక్షల నిర్వహణ ఉంటుంది. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం కేటాయించాము. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉంటాయని సబిత స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు.
సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment