అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాల అన్వేషణ
తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్, చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు
రెండు రాష్ట్రాల సీఎస్‌లు, చెరో ముగ్గురు అధికారులతో ఒక కమిటీ
2 వారాల్లో తమ స్థాయిలోని అంశాలకు పరిష్కారం చూపేలాప్రయత్నాలు
ఈ అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ
మంత్రుల కమిటీ నిర్ణయాలను సీఎంలు అంగీకరించేలా నిర్ణయం
అయినా పరిష్కారం దొరకని అంశాలపై సీఎంల స్థాయిలో చర్చలు
డ్రగ్స్, సైబర్ క్రైమ్‌లపై పరస్పర సహకారం కోసం కో–ఆర్డినేషన్ కమిటీ
వివరాలను వెల్లడించిన ఇరు రాష్ట్రాల మంత్రులు భట్టి విక్రమార్క, సత్యప్రసాద్
ఇకపై తరచూ కలుద్దామని ఇద్దరు సీఎంలు నిర్ణయించారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చించి.. పరిష్కార మార్గాలను గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అందులో ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులు సభ్యులుగా ఉంటారు. రెండు వారాల్లోగా ఈ కమిటీ సమావేశమై చర్చలు జరుపుతుంది.
ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు.. రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ మంత్రుల కమిటీ తేల్చిన పరిష్కారాలను ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించాలని నిర్ణయించారు. ఇక మంత్రుల కమిటీ స్థాయిలో సైతం పరిష్కారం లభించని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు నేరుగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అపరిష్కృతంగా ఉన్న ‘విభజన’ అంశాలపై తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు.
సాయంత్రం 6.20 నుంచి రాత్రి 8 గంటల వరకు గంటా 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి.. ఏపీ తరఫున మంత్రులు కందుల దుర్గేశ్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రజాభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఒక్క సమావేశంలోనే పరిష్కారాలు లభించవు: భట్టి
సీఎంలు, మంత్రులు, అధికారుల సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల నుంచీ అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతోపాటు ఇతర విషయాలపైనా చర్చించి ముందుకెళ్లాలనే ఆలోచనతో చర్చలు జరిపామన్నారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలకు ఈ ఒక్క సమావేశంలోనే సమాధానాలు దొరుకుతాయని అనుకోలేదని చెప్పారు. సమస్యలకు పరిష్కారాలు చూపడానికి విధానపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా తొలుత రెండు రాష్ట్రాల సీఎంల ఆధ్వర్యంలో చర్చలు జరిపామన్నారు. ఈ క్రమంలోనే సీఎస్‌లతో ఓ కమిటీ, మంత్రులతో మరో కమిటీకి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై కో–ఆర్డినేషన్ కమిటీ
మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలపై దర్యాప్తులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు భట్టి తెలిపారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టిందని.. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఈ అదనపు డీజీ, ఏపీ నుంచి అదే స్థాయి అధికారితో కలిపి కో–ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
తరచుగా కలుద్దామని సీఎంలు నిర్ణయించారు: ఏపీ మంత్రి సత్యప్రసాద్ అపరిష్కృత అంశాలపై చర్చించడానికి ఏపీ, తెలంగాణ సీఎంలు, అధికారులు సమావేశమవడం తెలుగు జాతికి హర్షనీయమని ఏపీ మంత్రి ఎ.సత్యప్రసాద్ పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకుంటారని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై చర్చిద్దామని చంద్రబాబు లేఖ రాయగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఈ సమావేశం ఏర్పాటైందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో జరిగిన ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పాటైన అంశంతోపాటు ఏపీ అభివృద్ధి విషయంలో ఉన్న సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుని చర్చలు జరిగాయన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మంచి వాతావరణంలో, సానుకూల ధోరణితో చర్చించినట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం తరచుగా కలుసుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారని వెల్లడించారు.
ఏపీ నుంచి తెలంగాణకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆయన సంకల్పించారని సత్యప్రసాద్ వివరించారు. ఏపీలో సైతం డ్రగ్స్ నియంత్రణ కోసం ఇప్పటికే ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ హర్షించేలా కమిటీలు చర్చించి, వివాదాల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment