నందిగామ: తెలంగాణలో కన్హా శాంతివనం ఏర్పాటు కావడం రాష్ట్రానికే గర్వకారణమని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పరిధిలోని కన్హా శాంతి వనాన్ని ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, సీఎం సలహా దారు వేం నరేందర్‌రెడ్డితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు, కన్హా శాంతివనం గురూజీ కమ్లేశ్ డి.పటేల్ (దాజీ)ని కలసి శాంతివనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్‌పై సీఎం ఆరా తీశారు. కళ్లకు గంతలు కట్టుకొని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి నైపుణ్యాలను పిల్లలు ప్రదర్శించడం చూసి ఆయన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామచంద్ర మిషన్ ద్వారా ఎంతో మంది తమ జీవితాలను మెరుగుపరచుకోవడంలో దాజీ మార్గదర్శకత్వం గొప్ప విషయమని అన్నారు. తర్వాత శాంతివనంలోని మెడిటేషన్ హాల్ సమీపంలో ముఖ్యమంత్రి మొక్కను నాటారు. దాజీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాంతివనాన్ని సందర్శించడం సంతోషకరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment