సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ .. ఢిల్లీలో కేంద్ర సర్కారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించిన 12 మంది తెలంగాణ బిడ్డలను గవర్నర్ సన్మానించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దర్బార్ హాల్‌లో అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు, వివిధ రంగాల ముఖ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకోనున్నారు. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం అధికారికంగా నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment